Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భయాందోళనలలో ముండ్లమూరు గ్రామస్థులు.. వణికిస్తున్న భూప్రకంపనలు…

  • ముండ్లమూరులో వరుసగా మూడు రోజులు భూప్రకంపనలు
  • ఈ భూప్రకంపనలపై అధ్యయనం చేయాలన్న శాస్త్రవేత్త రాఘవన్
  • పాఠశాల తరగతి గదుల్లో కూర్చోవడానికి భయపడుతున్న విద్యార్ధులు
  • పాఠశాల ఆవరణలో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజుల పాటు భూ ప్రకంపనలు రావడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. శని, ఆదివారాల్లో వచ్చిన భూకంపం నుంచి ప్రజలు తేరుకోకముందే సోమవారం ఉదయం, రాత్రి రెండు పర్యాయాలు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

సోమవారం ఉదయం 10.24 గంటల ప్రాంతంలో భూకంపం రాగా, దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. మరలా రాత్రి మరో రెండు సార్లు ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లో భూమి కంపించింది. రాత్రి 8.16 గంటలకు, 8.19 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లలోని ప్రజలు, దుకాణాల్లోని వ్యాపారులు ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి ఏమి జరుగుతోందనే భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. 

భూకంప కేంద్రం ముండ్లమూరు – ఉమామహేశ్వరపురం మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 4న, ఆ తర్వాత 21వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులూ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతినడంతో విద్యార్ధులు తరగతి గదుల్లో ఉండాలంటేనే భయపడుతున్నారు. దీంతో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ముండ్లమూరులో ఏర్పడిన భూకంపం గుండ్లకమ్మ నది ప్రాంతంలో కేంద్రీకృతమై వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 

శనివారం ఉదయం 10.35 గంటలకు ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదు కాగా, ఆదివారం ఉదయం 10.41 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.1, సోమవారం ఉదయం 10.24 గంటల సమయంలో నమోదైన భూకంప తీవ్రత 1.8గా నమోదైంది. 

ముండ్లమూరులో వరుసగా మూడు సార్లు భూకంపం రావడంపై శాస్త్రవేత్త రాఘవన్ స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు. వరుసగా మూడు రోజులూ ఒకే సమయంలో భూప్రకంపనలు ఎందుకు వచ్చాయనేది తెలుసుకోవాలంటే పరిశోధన చేయాలన్నారు. ప్రధానంగా అక్కడకు దగ్గరలో ఉన్న రిజర్వాయర్లు, గుండ్లకమ్మ వంటి నదుల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ముండ్లమూరు ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని హైడ్రోశాస్మసిటీ‌గా అనుమానిస్తున్నట్లు చెప్పారు. 

భూకంపం స్వామ్‌లో లోపల వీక్ జోన్ ఉండటం కూడా ఒక కారణం కావచ్చని అన్నారు. అయితే తరచూ ఇదే ప్రాంతంలో ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. భూకంపాల కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదన్న తహసీల్దార్ శ్రీకాంత్ .. కలెక్టరేట్‌కు అడిగిన నివేదికలు పంపించామని, దానిపై వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Related posts

కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి లేఖ సిద్ధం చేయండి: పవన్ కల్యాణ్ ఆదేశాలు!

Ram Narayana

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు!

Drukpadam

సిరివెన్నెల మృతి ప‌ట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

Drukpadam

Leave a Comment