Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

దక్షిణకొరియా విమాన ప్రమాదం.. 181 మందిలో ఇద్దరే ఎలా బతికారు? ఎక్కడ కూర్చున్నారు?

  • విమానం వెనుక భాగంలో కూర్చున్న మృత్యుంజయులు
  • కాలిపోతున్న తోక భాగం నుంచి ఇద్దర్నీ రక్షించిన రెస్క్యూ సిబ్బంది
  • విమానం వెనుక సీట్లలో మరణాల రేటు తక్కువగా ఉందంటున్న గణాంకాలు

దక్షిణకొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై కూలిన విషయం తెలిసిందే. ఈ పెనుప్రమాదానికి సంబంధించి దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. విమానంలో ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 181 మంది ప్రయాణించగా 179 మంది మృత్యువాతపడ్డారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిద్దరూ విమాన సిబ్బందే కావడం గమనార్హం.

మరి, అంతమంది చనిపోయిన ఘోర ప్రమాదంలో వీళ్లిద్దరూ ఎలా బతికారు?, విమానంలో ఎక్కడ కూర్చున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ విమానం వెనుక భాగంలో కూర్చున్నారు. విమాన ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే కమర్షియల్ ఫ్లైట్స్‌లో వెనుక భాగాలు కొంతలో కొంత సురక్షితమైనవని నివేదికలు పేర్కొంటున్నాయి.

విమాన ప్రమాదాలపై 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెనుక సీట్లలో మరణాల రేటు కాస్త తక్కువగా ఉన్నట్టు తేలింది. మరణాల రేటు విమానాల మిడిల్ సీట్లలో 39 శాతం, ముందు సీట్లలో 38 శాతం, వెనుక సీట్లలో 32 శాతంగా ఉందని తెలిపింది.

కాగా, దక్షిణకొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్‌ అనే ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో తగలబడిపోతున్న విమానం వెనుక భాగం నుంచి వీరిద్దరినీ రెస్క్యూ సిబ్బంది రక్షించారు. స్పృహలోకి వచ్చిన లీ… తనకు ఏమైందని, తాను ఎక్కడ ఉన్నానంటూ పదేపదే అడుగుతోందని వైద్యులు సోమవారం ప్రకటించారు. లీ ఎడమ భుజం విరిగిపోగా, తలపై గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇక క్వాన్‌కి చీలమండ విరిగిదని, తీవ్ర కడుపునొప్పితో అతడు బాధపడుతున్నారని వివరించారు.

Related posts

పాక్‌లో మహిళా క్రికెటర్లు బసచేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. !

Ram Narayana

ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. 22 మంది మృతి

Ram Narayana

Leave a Comment