Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి?

  • ఆరోగ్యం కోసం రోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి
  • వ్యక్తులను బట్టి, వారి వయసును బట్టి నడక అవసరం అంటున్న నిపుణులు
  • శారీరక, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు

కొత్త కొత్త టెక్నాలజీలు, మనం కూర్చున్న చోటికే అన్నీ వచ్చేసే స్థాయిలో సౌకర్యాలు రావడంతో… ఇటీవలి కాలంలో శరీరానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీనితో షుగర్, బీపీ, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు కమ్ముకుంటున్నాయి. కనీసం రోజూ కాసేపు వాకింగ్ చేసినా… ఈ సమస్యలను నివారించుకోవచ్చని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలాంటిది మరి ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్ చేయాలనే సందేహాలు ఉంటాయి. దానికి నిపుణులు ఏం చెబుతున్నారంటే…

ఆరు నుంచి 17 ఏళ్ల మధ్య పిల్లలు, టీనేజీ వాళ్లు…
వీరికి శరీరం ఎదిగే క్రమంలో ఉంటుందని, అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక వ్యాయామం ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచనల ప్రకారం… ఈ వయసువారు రోజూ కనీసం 60 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ.. అంటే 11 వేల నుంచి 12 వేల అడుగుల (సుమారు ఆరు నుంచి 8 కిలోమీటర్లు) నడక  లేదా తత్సమాన వ్యాయామం ఉండాలని సూచిస్తున్నారు.

18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసువారు…
వీరిలో దాదాపుగా ఎదుగుదల ఆగిపోయి ఉంటుంది. అయితే ఉన్నత చదువులు, ఉద్యోగం ఇతర వ్యాపకాలపై ఆధారపడి ఉండే సమయం. కాబట్టి శరీరానికి కొంత వ్యాయామం ఉంటుంది. ఇలాంటి వారు రోజూ కనీసం 8 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు (ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు) నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

60 ఏళ్లు పైబడినవారు…
వయసు పైబడినవారు రోజూ సుమారు 6 వేల నుంచి 8 వేల అడుగులు (సుమారు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్లు) నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, హైబీపీ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వయసు మీదపడటం వల్లే వచ్చే లక్షణాలను తగ్గించడానికి వాకింగ్ దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.

ఈ అంశాలను గుర్తుంచుకోండి
ఎవరైనా వాకింగ్ మొదలుపెట్టే ముందు వైద్యులను కలసి సలహా తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. వారి వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇతర అంశాల ఆధారంగా వాకింగ్ అవసరం మారవచ్చని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాలు అరుగుదల, లిగమెంట్లు బలహీనంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాకింగ్ చేయాలని స్పష్టం చేస్తున్నారు.

Related posts

జీరా వాటర్​, ధనియా వాటర్​… బరువు తగ్గేందుకు ఏది బెస్ట్​?

Ram Narayana

వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త.. ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

Ram Narayana

మందులు వాడకుండానే డయాబెటీస్​ ను రివర్స్ చేసుకున్న భారత సంతతి సీఎఫ్ వో

Ram Narayana

Leave a Comment