- మాదాపూర్ తో పాటు ఏపీలోని మచిలీపట్నంలోనూ తనిఖీలు
- గ్రీన్ కో కంపెనీతో నాటి బీఆర్ఎస్ సర్కారు ఫార్ములా ఈ రేసు ఒప్పందం
- అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చిన గ్రీన్ కో కంపెనీ
తెలంగాణలో ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి నాటి బీఆర్ఎస్ సర్కారు గ్రీన్ కో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో గ్రీన్ కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాలు అందించాయి. ఇది క్విడ్ కో ప్రో అని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది.
ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు గ్రీన్ కో కంపెనీ ఆఫీసుపై రైడ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ లోని గ్రీన్ కో ఆఫీసుతో పాటు ఏపీలోని మచిలీపట్నంలో ఉన్న అనుబంధ కార్యాలయంపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం చేరుకుని చలమశెట్టి సునీల్‌కు చెందిన ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది.
ఉదయం నుంచి మాదాపూర్‌లోని కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయని, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్ట్స్ జెన్’ లోనూ తనిఖీలు జరుపుతున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. 2022 అక్టోబరు 25న ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు సంబంధించి గ్రీన్ కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే అంటే.. ఏప్రిల్ లో గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.31 కోట్లు, ఆ తర్వాత అక్టోబర్ లో రూ.10 కోట్లు విరాళం అందించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ దృష్టి సారించింది. తాజాగా నిర్వహిస్తున్న సోదాలు ఇందులో భాగమేనని సమాచారం.