- చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండే ఆహార పదార్థాలు కొన్ని…
- వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుండేవి మరికొన్ని…
- కొన్నింటిని మాత్రం చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్న నిపుణులు
కొన్ని రకాల ఆహార పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు రుచికరంగా ఉంటాయి. మరికొన్నింటిని వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. చల్లగా తినాల్సిన వాటిని వేడి చేసినప్పుడు, వేడిగా తినాల్సినవి చల్లారిపోయినప్పుడు… తీసుకుంటే అంతగా రుచించవు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం వేడిగా ఉన్నప్పుడే తినాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అన్నం… బ్యాక్టీరియా సమస్య
అన్నం చల్లబడిపోయిన వెంటనే దానిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని సూచిస్తున్నారు. అన్నం చల్లబడి చాలా సేపు అయితే తగిన విధంగా వేడి చేసుకుని తినడం వల్ల రుచి బాగుంటుందని, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయని పేర్కొంటున్నారు.
పిజ్జాలు… గొంతులో ఇబ్బంది
వీటిని చల్లారిపోయినప్పుడు తీసుకోవడం వల్ల… అందులోని చీజ్, మైదా బ్రెడ్ వంటివాటితో గొంతులో ఇబ్బందికరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే వేడి చేయడం వల్ల చీజ్ కరిగి మెత్తబడుతుందని, అడుగున ఉండే బ్రెడ్ క్రిస్పీగా మారుతుందని… దీనితో ఇబ్బంది తప్పుతుందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పిజ్జాలపై వాడే టాపింగ్స్ కూడా వేడిగా తిన్నప్పుడే రుచిగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
మాంసాహారం… ఆరోగ్యం కోసం..
చేపలు, రొయ్యలు, గుడ్లు, చికెన్, మటన్ వంటి మాంసాహారం చల్లారిన వెంటనే బ్యాక్టీరియా వంటివి వేగంగా పెరగడం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని వీలైనంత వరకు తగిన స్థాయిలో వేడి చేసుకుని తింటేనే మంచిదని సూచిస్తున్నారు. వేడి చేయడం వల్ల అవి రుచిగా ఉంటాయని… బాగా నమిలి తినడం వల్ల సులువుగా జీర్ణం అవుతాయని స్పష్టం చేస్తున్నారు.
తరచూ తినే ఆహార పదార్థాలు మరెన్నో..
- బంగాళ దుంపలు కూడా ఉడికించినా, వేయించినా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటే బాగుండవని… బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. వేడి చేసుకుని తినడం వల్ల రుచిగా కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
- చాలా మంది పాస్తాను చల్లారిపోయిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. అయితే దానిని వేడి చేసుకుని తింటేనే గొంతుకు హాయిగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
- చికెన్, బంగాళదుంప వంటివి డీప్ ఫ్రై చేసినప్పుడు వేడిగా తింటేనే వాటి రుచి బాగుంటుందని, చల్లారిపోతే జిగటగా మారి తినడానికి బాగుండవని నిపుణులు సూచిస్తున్నారు. వేడి చేయడం వల్ల వాటి నుంచి నూనె కూడా బయటికి వస్తుందని… దాన్ని తొలగించి తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.