- ‘ఫార్ములా ఈ’ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న దానం
- అందులో అవినీతి జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్య
- ‘హైడ్రా’పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే
- ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హైదరాబాద్‌లో ఓ డీసీపీకి హెచ్చరిక
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి ఆపై కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ‘ఫార్ములా ఈ’ కార్ రేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విచారణ జరుగుతుండగా దానం మాత్రం ఫార్ములా ఈ కార్ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని, ఈ రేసుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, జరగలేదని మాత్రం కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.
హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని దానం తెలిపారు. ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని గుర్తు చేస్తూ.. మన మీద నమ్మకం లేదని, ఇప్పుడైనా దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హైదరాబాద్‌లోని ఓ డీసీపీకి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కేసులు పెడతానంటూ బెదిరించడం వల్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తుందని దానం పేర్కొన్నారు.