- పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు
- బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లలో పండుగకు బయలుదేరిన హైదరాబాద్ వాసులు
- పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన కార్లు, ఇతర వాహనాలు
సంక్రాంతి పర్వదినం కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు! తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు! బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరారు.
చాలామంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో చాలామంది ఈరోజే కార్లు, ఇతర వాహనాల్లో తమ తమ గ్రామాలకు బయలుదేరారు.
పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈటోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూత్‌లు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో రెండు బూత్‌లను తెరిచారు. పంతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పని చేస్తున్నారు. చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారు.