Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

‘గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!

  • బీహార్‌లోని నవడా జిల్లాలో ఫేస్‌బుక్‌లో ముఠా ప్రకటన
  • బాధితుల నుంచి పాన్, ఆధార్, ఇతర వివరాల సేకరణ
  • హోటల్ గదుల కోసం బాధితుల నుంచి డబ్బుల వసూలు
  • ఇచ్చేందుకు నిరాకరిస్తే బ్లాక్‌మెయిల్‌కు దిగిన నిందితులు
  • 8 మంది అరెస్ట్.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

‘సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి.. రూ. 13 లక్షలు అందుకోండి’.. ఈ ప్రకటన చూసి ఇదేదో బాగుందని వెళ్లిన వారు నిలువునా మోసపోయారు. బీహార్‌లోని నవడా జిల్లాలో బయటపడిన ఈ స్కాం కలకలం రేపింది. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’, ‘ప్లే బాయ్ సర్వీస్’ పేరిట ముఠా ఒకటి ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చింది. సంతానానికి నోచుకోని మహిళలను గర్భవతులను చేస్తే రూ. 13 లక్షలు పొందవచ్చని ఊరించింది. అంతేకాదు, గర్భవతులను చేయడంలో విఫలమైనా రూ. 5 లక్షల వరకు పొందవచ్చని పేర్కొంది.

అంతే, ఈ ప్రకటన చూసిన వారు ఇదేదో బాగుందని పొలోమంటూ ఆ సంస్థను ఆశ్రయించారు. అలా వచ్చిన వారి నుంచి పాన్‌కార్డ్, ఆధార్‌కార్డ్‌తోపాటు ఇతర వివరాలను నిందితులు సేకరించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 799 చొప్పున వసూలు చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్, హోటల్ గదుల బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. అలాగే, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 20 వేల వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చేందుకు బాధితులు నిరాకరిస్తే బ్లాక్‌మెయిల్ చేసేవారు. ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు.

ఈ ముఠా వ్యవహారంపై అనుమానంతో కొందరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కస్టమర్ల ఫొటోలు, వాట్సాప్ చాటింగ్, ఆడియో రికార్డింగ్, బ్యాంక్ లావాదేవీలను గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

లండ‌న్‌కి చేరిన ‘డ‌బ్బావాలా’ విధానం.. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌!

Ram Narayana

ఇదో అద్భుతం …610 కేజీల నుంచి 63 కేజీలకు తగ్గాడు… రాజు తలచుకుంటే అంతే…!

Ram Narayana

పాము కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం.. చీకట్లో 11 వేల మంది!

Ram Narayana

Leave a Comment