జర్నలిస్టులకు అక్క్రిడేషన్ కార్డులతో పాటె హెల్త్ కార్డులు …మంత్రి పొంగులేటి
ఇళ్లస్థలాల విషయంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏమి వ్యాఖ్యానించను
ఖమ్మంకు ఏ డీ కార్యాలయం తరలింపు విషయంలో సాంకేతిక సమస్యలు
కేటీఆర్ ను తొందర పడి అరెస్ట్ చెయ్యం …
విచారణ జరగాక చట్టం తన పని తాను చేసుకు పోతుంది
ఈడీ ఎందుకు అరెస్టుచెయ్యదని కేంద్ర మంత్రి బండికి సూటి ప్రశ్న
ఈ నెల 26 నుండి మరో నాలుగు హామీలు అమలు
ఇకపై గ్రామాల్లోనే రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు
ఫిబ్రవరి 15 తర్వాత భూమాత పూర్తి స్థాయిలో అమలు
జీవో 59 ద్వార బీఆర్ఎస్ నేతలు పొందిన భూములు వెనక్కి
ఫార్ములా ఈ-కార్ రేసులో కేసు నమోదు చేస్తే లొట్టపీసు అనడమేమిటని కేటీఆర్‌పై ఆగ్రహం
ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయని వెల్లడి
జర్నలిస్టులకు అక్క్రిడేషన్ కార్డులతోపాటు హెల్త్ కార్డులు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర సమాచార, రెవెన్యూ,గృహనిర్మాణ శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు …ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను గురించి వివరించారు ..ఈసందర్భంగా జర్నలిస్టుల ఇళ్లస్థలాలు ,హెల్త్ కార్డులు ,ఖమ్మంలో ఏ డి కార్యాలయం ఏర్పాటు , కేటీఆర్ అరెస్టు విషయం, భూభారతి , రేషన్ కార్డులు గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు …జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి, ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుఇచ్చిన నేపధ్యంలో దానిపై బహిరంగంగా తానేమీ మాట్లాడనన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపట్ల కక్షపూరితంగా వ్యవహరించబోదని, కానీ ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగేసిన వారిని మాత్రం వదిలేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తే లొట్టపీసు అంటూ కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మంత్రులు తప్పులు చేసి… ఇప్పుడు తామేదో చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మంత్రులు చెబితే తాము కొన్ని పనులు చేశామని పలువురు అధికారులు ఏసీబీ విచారణలో వెల్లడిస్తున్నారని తెలిపారు. ఫార్ములా ఈ-కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ కేసులో ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ ఎంటర్ అయిందన్నారు.
కేటీఆర్‌ను ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ నేతలు అడుగుతున్నారని, మరి ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదో వాళ్లు కూడా చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. రైతు భరోసా విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుందని హామీ ఇచ్చారు. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.
విచారణ జరప కుండా తమ ప్రభుత్వం తొందర పడిఎవరినీ అరెస్ట్ చేయబోదని రాష్ట్ర మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే ఈ ఫార్ముల కారు రేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే, ఈడీ కూడా ఎంటరై కేసు రిజిష్టర్ చేసింది కదా ? ఈ వ్యవహారంలో మేం కుమ్మక్కయ్యామని భావిస్తే, కేటీఆర్ ను మీరు అరెస్ట్ చెయ్యండన్నారు. మీరు అరెస్ట్ చేస్తుంటే, మేమేం వద్దన లేదు కదా ? మీరేందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ ను సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు లేస్తే కాలు దువ్వెది మా మీద తప్ప, మీ మీద కాదని, వారితో తాము కుమ్మక్కయ్యే ప్రసక్తే లేదని పొంగులేటి తెగేసి చెప్పారు. వ్యక్తులపై గానీ, వ్యవస్థలపై గానీ, రాజకీయ పార్టీలపై గానీ తమ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించబోదన్నారు. ఒక రోజు వెనుకా ముందైనా, సమగ్ర విచారణ తర్వాతే, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. ఈ ఫార్మల కారు రేసు వ్యవహారంలో అప్పటిమంత్రులు తాము గొప్పలు చేశామని చెప్పుకుంటుంటే, అప్పుడున్న అధికార్లు మాత్రం, అప్పటి మంత్రుల వత్తిడితోనే తప్పులు చేశామని ఒప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో, చట్టం తన పని తాను చేసుకు పోతుందని అప్పటి మంత్రులు చెప్పినట్లు, ఇప్పుడు కూడా ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
ఈ నెల 26 నుండి 4 హామీలు అమలు
ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ నెల 26 నుండి మరో 4 హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ఎన్ని లక్షల రేషన్ కార్డులు అవసరమైనా ఇవ్వడానికి వెనుకాడేది లేదన్నారు. గతంలో వున్న రేషన్ కార్డులకు అధనంగా ఈ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రైతు భరోసా క్రింద ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇచ్చే పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభిస్తామన్నారు. భూమి లేని నిరు పెద కుటుంబాలకు ఇందిరమ్మ భరోసా క్రింద ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. స్వంత భూమి లేకుండా, 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్ళిన కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కూడా ఈ నెల 26 నే శ్రీకారం చూడతామన్నారు. ప్రజా పాలనలో ఇళ్ళ కోసం కోటీ 15 లక్షల దరఖాస్తులు రాగా,ఇప్పటి వరకు 72 లక్షల ధరఖాస్తులకు సంబంధించిన వివరాలను సేకరించామని తెలిపారు. వీటి నుండి అర్హులను ఎంపిక చేసి, వారి పేర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు పెట్టి ప్రకటిస్తామని చెప్పారు. మిగిలిన3 పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను కూడా ఇలాగే గ్రామ సభల్లో వెల్లడిస్తామన్నారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈ నెల 15 లోగా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు, సమబంధిత అధికార్లతో సమావేశాలు నిర్వహిస్తారని,16 నుండి అర్హులను గుర్తిస్తామని తెలిపారు.
గ్రామాల్లోనే రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు
ఇకపై గ్రామాల్లోనే రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. మున్న జరిగిన క్యాబినెట్ మీటింగులోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వుందని, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదన్నారు. వచ్చే క్యాబిననేట్ మీటింగులో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆమోదం పొందిన భూమాత చట్టం ఫిబ్రవరి 15 నుండి 28 మధ్య పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. ధరణిని తీసుకొచ్చిన గత ప్రభుత్వం, దానికి ఎటువంటి రూల్స్ ను ఫ్రేం చేయలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తెచ్చిన భూమాత చట్టంలోఅవసరమైన అన్ని నిబంధనలు పొందుపర్చామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి లాండ్ అప్పిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మార్వో నుండి కలెక్టర్ వరకూ అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఈ చట్టంలో వుందని పేర్కొన్నారు. ఇప్పుడు భూమాతలో వున్న అనుభవదారు కాలం వల్ల, పట్టాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీని వల్ల వారి హక్కులకు ఎటువంటి ఇబ్బందీ కలగదని భరోసా ఇచ్చారు. ముందు ముందు భూములు సర్యే చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వముందని సూచన ప్రాయంగా వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 59 జీవో ద్వార పింక్ కలర్ నాయకులు కాజేసిన భూములను తిరిగి తీసుకుంటామని ప్రకటించారు. రిజిష్ట్రేషన్ శాఖలో ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినా, ఉపేక్షించేది లేదన్నారు. రానున్న కాలంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, మళ్ళీ తప్పులు జరగకుండా చూస్తామని పొంగులేటి ఈ సందర్భంగా పేర్కొన్నారు.