- మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- తాను ఎవరి సలహాలైనా స్వీకరిస్తానన్న సీఎం
- తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టీకరణ
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… విపక్ష నేతలు అయినా సరే, వారి అనుభవం అవసరం అనుకుంటే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు రాష్ట్రాల్లో అధికార, విపక్షాలు అని తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడుతున్నాయని అన్నారు. తనకు ఎటువంటి భేషజాలు ఉండవని, ఎవరి నుంచైనా సలహాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యాసాగర్ రావు వంటి వ్యక్తుల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందేలా పాటుపడుతున్నామని అన్నారు. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదని… ప్రపంచ నగరాలతో అని తమ వైఖరిని చాటిచెప్పారు. కేంద్రం చేయూత అందిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని… మెట్రో, ఆర్ఆర్ఆర్ అంశాల్లో సహకారం అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని రేవంత్ వెల్లడించారు.
నాడు అద్వానీని ఎన్టీఆర్ మెచ్చుకున్నారు: విద్యాసాగర్ రావు
- మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ
- ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు విద్యాసాగర్ రావు ప్రస్థానం
- కొన్నిసార్లు అధికార, విపక్షాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడి
- ఎన్టీఆర్ సాంస్కృతిక జాతీయ వాదం ఉన్న నేత అని కితాబు
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తన ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో సభలో ఆసక్తికర ప్రసంగం చేశారు. తాను గవర్నర్ గా వ్యవహరించిన కాలంలో ‘ఉనిక’ పుస్తకం రాశానని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు తన ప్రస్థానం ఈ పుస్తకంలో పొందుపరిచానని వివరించారు.
పాలక పక్షం, విపక్షం రాజకీయాలకు పోకుండా ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని స్పష్టం చేశారు. నేతల్లో సాంస్కృతిక జాతీయ వాదం ఉండాలని అభిలషించారు. నాడు బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర వేళ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారని, అశ్వమేథ యాగం చేస్తున్నారంటూ అద్వానీని మెచ్చుకున్నారని వివరించారు. ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా కూడా బీసీ వాదాన్ని సమర్థంగా వినిపించారని కొనియాడారు. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
అధికార, విపక్షాలు జాతీయ ప్రయోజనాల కోసం అయినా కొన్ని సందర్భాల్లో కలిసిపోవాలని సూచించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేటు బిల్లు పెడితే, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆయన మద్దతిచ్చారని, ఆ బిల్లు పాస్ అయిందని విద్యాసాగర్ రావు గుర్తుచేసుకున్నారు.