Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో విచిత్రమైన పరిస్థితి… ఓవైపు కార్చిచ్చు… మరోవైపు మంచు తుపాను!

  • అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి వైపరీత్యాల పంజా
  • అమెరికాలో దక్షిణాది రాష్ట్రాలపై మంచు తుపాను ప్రభావం
  • 3 వేలకు పైగా విమాన సర్వీసుల రద్దు
  • లాస్ ఏంజెలిస్ నగరాన్ని తుడిచిపెట్టేసిన కార్చిచ్చు 

అగ్రరాజ్యం అమెరికా ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతం అమెరికాలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఒక భాగంలో కార్చిచ్చు దహించి వేస్తుంటే, మరో భాగంలో మంచు తుపాను కమ్మేసింది. 

అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర మంచు తుపాను పంజా విసురుతోంది. భారీగా మంచు కురుస్తుండడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 3 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఐదు రన్ వేలను మూసివేశారు. 

తాజా పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని, 1100 విమాన సర్వీసులను నిలిపివేసినట్టు డెల్టా ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అటు డాలస్ లోని ఫోర్ట్ వర్త్ ఎయిర్ పోర్టు, నార్త్ కరోలినాలోని చార్లోటే డగ్లస్ ఎయిర్ పోర్టులోనూ ఇంచుమించు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఈ రెండు ఎయిర్ పోర్టుల నుంచి 1,200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

మంచు తుపాను కారణంగా అమెరికాలో ఇప్పటిదాకా ఐదుగురు మరణించారు. అమెరికాలోని మధ్య భాగాలు, తూర్పు రాష్ట్రాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ లకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

అటు, లాస్ ఏంజెలిస్ నగరాన్ని కార్చిచ్చు కబళించింది. దాదాపు 10 వేల భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ స్టార్లు సైతం విలాసవంతమైన భవనాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

కార్చిచ్చు కారణంగా ఇప్పటిదాకా 11 మంది మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాదాపుగా రూ.13 లక్షల కోట్ల మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా.

Related posts

ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా.. 13 మంది భారతీయులు సహా 16 మంది గల్లంతు

Ram Narayana

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం…

Ram Narayana

ఎన్నికల కవరేజీకి అనుమతివ్వలేదన్న విదేశీ జర్నలిస్టు.. స్పందించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment