ఖమ్మంలో ఐదుగురు మంత్రులు …శంకుస్థాపన , సమీక్షలతో బిజీ బిజీ
జనవరి 26 నుంచి 45 వేలకోట్లతో నాలుగు పథకాలకు శ్రీకారం
ఎన్నికల వాగ్దానాల మేరకు అన్ని నెరవేర్చుతాం…డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాలన
ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు
ఖమ్మం కలెక్టరేట్ లో పథకాల అమలు -పరిష్కరాలకు ప్రత్యేక విభాగం
ఖమ్మంలో సోమవారం ఐదుగురు మంత్రుకు ఒకేసారి పర్యటించి అధికారులకు , పోలీసులకు ,మీడియా ఉక్కిరి బిక్కిరి చేశారు …మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పై చేపట్టిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంతోపాటు , జనవరి 26 నుంచి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభరోసా , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా , ఇందిరమ్మ ఇండ్లు ,నూతన రేషన్ కార్డులు జారీ అమలు పై అధికారులు ,ప్రజాప్రతినిధులతో సమీక్షా నిర్వహించారు …ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు , ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు .. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు ..ఎక్కడ తప్పులు జరగకుండా చూడాలని అన్నారు …సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలుపై ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం, మెస్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీల పెంపు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నా మని, రైతులకు ఇచ్చిన మాట మేరకు 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, సన్న రకం ధాన్యం క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ అందించామని అన్నారు.
ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాలను గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయాలని నిర్ణయించి, ఈ పథకాలకు ప్రభుత్వం దాదాపు 45 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు 22 వేల 500 కోట్లు, రైతు భరోసా 18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేర కట్టుబడి అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించి మార్గదర్శకాలు జారీ చేశామని అన్నారు.
రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12 వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలు 20 రోజులు ఉపాధి హామీ పని చేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు.
ప్రతి పథకానికి లబ్దిదారులను గ్రామ సభ పెట్టి పారదర్శకంగా ఎంపిక చేయాలని అన్నారు. ఇందిరమ్మ కమిటీల సభ్యులను భాగస్వామ్యం చేయాలని, ప్రతి గ్రామ సభలో కార్యక్రమం పెట్టి ప్రభుత్వ లక్ష్యాలు తెలియజేయాలని అన్నారు. జిల్లా మంత్రి చే జాబితా ఆమోదింపచేసుకొని మంజూరు ప్రోసిడింగ్స్ అందజేయాలని అన్నారు.
ఎంత మంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది, ఎంత మంది రైతు భరోసా వస్తుంది, బోనస్ వచ్చిన రైతుల వివరాలు తెలియజేస్తు గ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఖమ్మం జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పలు గ్యారెంటీ పథకాలను అమలు చేశామని అన్నారు. పేద ప్రజలకు అత్యంత చేరువయ్యే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాలను
జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నామని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరడం ఎంత ముఖ్యమో, అనర్హులకు అందకుండా వృధా కాకుండా చూడడం కూడా చాలా కీలకమని మంత్రి తెలిపారు. భూసేకరణ జరిగిన భూములు, రాళ్లు, రప్పలు ఉన్న భూములు కాకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని అన్నారు. గత పాలకుల హయాంలో రేషన్ కార్డులు అందలేదని, అర్హులందరికీ ప్రస్తుతం రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. రాబోయే 10 రోజులు అధికారులు కష్టపడి గ్రామాలలో తిరిగి అర్హులను ఎంపిక చేయాలని, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాల అమలు కావాలని అన్నారు.
*రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో భారీగా నిధులు ఖర్చు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్లాలని అన్నారు.
వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి 12 వేలు అందిస్తామని, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆహారభద్రత చట్టాన్ని దేశంలో ప్రవేశ పెట్టామని, నూతన రేషన్ కార్డుల జారీ, కార్డులలో నూతన సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.
నూతన రేషన్ కార్డుల జారీ అంశంలో అధికారులు మానవీయ దృక్పథంతో పని చేయాలని, ప్రతి ఒక్కరికి 6 కీలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం సన్న బియ్యం మీద 11 నుంచి 12 వేల కోట్ల ఖర్చు చేయబోతున్నా మని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 3500 ఇండ్లు చోప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇండ్లు మొదటి విడతలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎక్కడా పెట్టుబడి సహాయం చేరవద్దని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడికి సహాయం అందేలా చూడాలని అన్నారు.
లేఔట్, నాలా, భూ సేకరణ, పరిశ్రమల, మైనింగ్ భూముల సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, గ్రామ శాటిలైట్ మ్యాప్ వాడుతూ పారదర్శకంగా అర్హుల ఎంపిక ఉండాలని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా, వేయక పోయినా రైతు భరోసా అందుతుందని అన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని అన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహయం అందిస్తామని అన్నారు. 20 రోజులు ఉపాధి హామీ పని చేసి, గుంట భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను గుర్తించి ఈ పథకం అమలు చేయాలని అన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ సందర్భంగా 4 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనికి సంబంధించిన విధి విధానాలను క్యాబినెట్ ఆమోదించిందని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలు అధికారులు పక్కాగా అమలు చేయాలని, ఎక్కడ ఎటువంటి తప్పు జరుగడానికి వీలు లేదని అన్నారు.
4 కార్యక్రమాలకు సంబందించి గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని అన్నారు. ప్రతి గ్రామ సభలో ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని చెప్పాలని అన్నారు. ఈ 4 పథకాలకు సంబంధించిన గైడ్ లైన్స్ పై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పేదలకు కులమతాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం 4 లక్షల 50 వేల ఇండ్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు డేటా చాలా కీలకమని, అధికారులు వివరాలు సరిగ్గా నమోదు చేస్తేనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, అధికారులు జాగ్రత్తగా పని చేయాలని అన్నారు.
మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన, ఇతరులకు బ్యాంకులలో రుణాలు కూడా అందడం లేదని , దీనిని పరిష్కరించా లని అన్నారు. గతంలో దళిత బంధు వంటి పథకాలు పొందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో కాకుండా రెండో విడతలో జారీ చేయాలని అన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభిస్తుందని అన్నారు. ఈ పథకాల అమలు సంబంధించి ప్రజలకు ఉన్న సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు వ్యవస్థను కూడా జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
జనవరి 24 నాటికి రైతు భరోసా లబ్దిదారుల సంబంధించి తుది జాబితా సిద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో వ్యవసాయ యోగ్యమైన భూముల గుర్తించి గ్రామ సభ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయాలని అన్నారు.
2023-24 సంవత్సరానికి 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతలలో 6 వేల చొప్పున మొత్తం 12 వేలు సహాయం అందించనున్నట్లు, గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల తుది జాబితా రూపొందించి, జనవరి 24 నాటికి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా వచ్చిన వివరాల ప్రకారం రేషన్ కార్డు లేని కుటుంబాల సర్వె చేసి అర్హులను గుర్తించాలని అన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, పట్టణాలలో మున్సిపల్ కమీషనర్ నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని, గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింప చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ద్వారా సొంత భూమి ఉండి ఇండ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేశామని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే సూపర్ చెక్ కార్యక్రమం జనవరి 16 నుంచి జనవరి 19 లోపు పూర్తి చేసి జాబితా గ్రామంలో ప్రదర్శించాలని, జనవరి 20 లోపు అభ్యంతరాల స్వీకరించి , తుది జాబితా ప్రచురించాలని అన్నారు. గ్రామ/ వార్డు సభలను జనవరి 24 లోపు నిర్వహించి ప్రాధాన్యత క్రమంలో వ్యక్తిగత మంజూరు ఉత్తర్వులు జనవరి 26 నుంచి జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అధికారులు పని చేయాలని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12 వేల ఆర్థిక సహాయం అందాలని అన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు, రియల్ ఎస్టేట్, లే ఔట్ గా మారిన భూములు, మైనింగ్, పరిశ్రమల క్రింద భూములు, వివిధ ప్రాజెక్టుల క్రింద భూ సేకరణ చేసిన భూములను మినహాయించా లని అన్నారు. అనర్హులకు ప్రభుత్వ సహాయం చేరకుండా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని అన్నారు.
రేషన్ కార్డులు అర్హులకు మాత్రమే జారీ చేయాలని అన్నారు. రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులు అవసరం లేదని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం రేషన్ కార్డు లేని అర్హులైన కుటుంబాల వివరాలు మండలాలు, గ్రామాల వారీగా మనకు చేరాయని, వాటిని సర్వే చేస్తూ రేషన్ కార్డు జారీ కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హుల ఎంపిక పారదర్శకంగా గ్రామసభ ద్వారా చేపట్టాలని అన్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద మొదటి దశలో అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి లాటరీ పద్ధతిలో వాళ్లకు ఇండ్ల కేటాయింపు చేయాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో సింగరేణి ప్రాంతాల్లో, గిరిజన ఏరియాలలో కూడా ఇందిరమ్మ ఇండ్ల గత పద్ధతిలో మంజూరు చేయాలని అన్నారు. 40 ఏళ్ళ క్రితం అందించిన కాలనీలు ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇండ్లు మంజూరుకు అవకాశం కల్పించాలని అన్నారు.
సింగరేణి క్రింద తక్కువ ఫించన్ వచ్చే వారికి కూడా రేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఆహార భద్రత కార్డుల ద్వారా గతం లో మాదిరి పప్పు, ఉప్పు, నూనె వంటి సరుకులు బియ్యంతో పాటు సరఫరా చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న ప్రజలకు స్థలానికి సర్టిఫికెట్ అందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చూడాలని కోరారు. ఒక గుంట, రెండు గుంటల భూమి ఉన్న కుటుంబాలకు కూడా కూలీలుగా గుర్తించి వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించాలని అన్నారు.
*పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పినపాకలో అధికంగా ఏజేన్సీ ప్రాంతం ఉందని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ఇక్కడ ఎస్సి, బిసి, మైనార్టీ లకు భూములు ఉన్నా పట్టాలు లేవని, వీరు క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నారని, వీరికి కూడా రైతు భరోసా అందించాలని అన్నారు.
ఏజేన్సీ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు భూమి పోజిషన్ సర్టిఫికెట్ అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దివ్యాంగులకు, ఇండ్లు అగ్నిప్రమాదానికి కాలిపోయిన వారు, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేయాలని అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో వచ్చిన విమర్శలు ఈసారి రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
*భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో ఇందిరమ్మ ఇళ్లు క్రింద లక్ష రూపాయల సహాయం అందించామని, గతంలో మంజూరు చేసి పూర్తి కాని ఇండ్లను ప్రాధాన్యత తీసుకుని ముందు పూర్తి చేయాలని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని, బియ్యంతో పాటు ఇతర ఆహార పదార్థాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అశ్వరావు పేట ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ, 4 అద్భుతమైన కార్యక్రమాలకు అమలుకు నేడు సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాల అమలుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏజేన్సీ ప్రాంతంలో పట్టా లేని భూములకు రైతు భరోసా అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుందో లేదో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
*వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, పట్టాలు లేకుండా సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా, రైతు వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు . గతంలో గిరిజన, ఇతరులకు కూడా ఇండ్లు మంజూరు చేసామని అదేవిధంగా ప్రస్తుతం కూడా అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
*సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులకు పథకాలు అందేలా చూడాలని, ఎక్కడ ఎటువంటి అవినీతి పాల్పడటానికి వీలు లేదని అన్నారు. గతంలో అనర్హులకు జారీ చేసిన రేషన్ కార్డులు తొలగించాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఐ.టి.డి.ఏ. పి.ఓ.బి. రాహుల్,
ఖమ్మం సీపీ సునీల్ దత్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.