సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పాలముర్రు బిడ్డ జాన్ వెస్లీ
దళితునికి మొదటిసారి రాష్ట్ర కార్యదర్శి పదవి
సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహా సభలు
మహాసభల్లో జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటన
వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ
పార్టీ పదవుల నుంచి స్వచ్చందంగా తప్పుకున్న తమ్మినేని , చెరుపల్లి ,నరసింగరావు
సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియమితులయ్యారు.గత 15 సంవత్సరాలుగా తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటించింది .. అయితే కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీపడ్డారని వారిలో ఎస్ వీరయ్య ,జూలకంటి రంగారెడ్డి ఉన్నారని సమాచారం …చివరికి రాష్ట్ర కమిటీ జాన్ వెస్లీ వైపు మొగ్గు చూపడంతో ఆయన ఎన్నికయ్యారు …
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పార్టీని నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం స్వచ్చందంగా రిలీవ్ అయ్యారు. దాదాపు మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవీ బాధ్యతలు నిర్వహించారు . ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీని పదవి వరించింది . ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో ప్రారంభమైన మహాసభ నేడు ముగిసింది. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ సమన్వయ కర్త ప్రకాష్ కారత్ , పొలిట్ బ్యూరో సభ్యులు, బృంద కారత్ , బివి రాఘవులు ,ఎం ఏ బేబీ , విజయరాఘవన్ లు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా జి.నాగయ్య, ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, టి.జ్యోతి, మల్లు లక్ష్మి, ఎం.డి. అబ్బాస్, చుక్క రాములు, పాలడుగు భాస్కర్, టి.సాగర్, పి.ప్రభాకర్, బి.రవికుమార్, నున్నా నాగేశ్వరరావు, ఎం.డి. జహంగీర్ లను మహాసభ ఎన్నికయ్యారు.
జాన్ వెస్లీ వనపర్తి జిల్లాలోని అమరచింతకు చెందినవారు. ఆయన గతంలో డీవైఎఫ్ఐ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరిగాయి.
సిపిఎం కు తమ్మినేని చేసిన సేవలు అమోఘం …
సిపిఎం కు తమ్మినేని వీరభద్రం చేసిన సేవలు అమోఘం …చిన్నతనం నుంచే పార్టీలో ప్రజాసంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తమ్మినేని రాష్ట్రంలో బలమైన ఉద్యమాల జిల్లా ఖమ్మం కు కార్యదర్శిగా పనిచేశారు … అనుకున్నది సాధించాలనే పట్టుదల , అందుకు తగిన ఎత్తుగడలు , వ్యూహాలు రచించడంలో మంచి దిట్టగా ఆయనకు పేరుంది … ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా , కార్యదర్శివర్గ సభ్యునిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా సేవలు అందించారు … 1996 లో లోకసభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కు ఆయన ఎన్నికైయ్యారు …తర్వాత 2004 లో ఖమ్మం శాసనసభకు సిపిఎం అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు …పార్టీ పట్ల అంకిత భావం , సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసం ,గల తమ్మినేని అనేక మంది యువకులను పార్టీలోకి ఆకర్శించి ప్రోత్సహించారు … ఆయన రాజకీయ శిక్షణ తరగతుల్లో అర్థశాస్త్రం , గతితార్కిక భౌతిక వాదం , పార్టీ నిర్మాణం , పార్టీ కార్యక్రమంపై ఆయన చెప్పే పాఠాలు వినేందుకు పెద్ద పెద్ద మేధావులు సైతం ఆసక్తి చూపేవారు …మంచి ఉపన్యాసకుడు,మంచి దస్తూరి ఆయన సొంతం … ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక పాత్ర … ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు … ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కోలుకోలేని దెబ్బలు తగిలి అనేకమంది పార్టీని వీడి పదవుల కోసం పాకులాడుతున్న సందర్భంలో పార్టీని ఆయన నడిపించిన తీరు చెప్పుకోతగ్గది … ఆయన సేవలు మరికొంత కాలం పార్టీకి ప్రధానంగా జాన్ వెస్లీ లాంటి నాయకులకు అవసరం … ఆయన ముగింపు ప్రసంగం లో కమ్యూనిస్టు లకు రిటైర్మెంట్ లేదని ప్రకటించి రాష్ట్ర నాయకత్వానికి భరోసా కల్పించారు…