స్కర్టులు, శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే ఇక నో ఎంట్రీ
- వచ్చే వారం నుంచే అమల్లోకి రానున్న డ్రెస్ కోడ్ నిబంధన
- కొందరు భక్తుల ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ట్రస్ట్
- భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని భక్తులకు సూచన
ముంబైలోని ప్రసిద్ధి చెందిన సిద్ధివినాయక ఆలయం భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టింది. వచ్చే వారం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇకపై భక్తులు భారతీయ వస్త్రధారణలో రావాలని, పూర్తి ఆచ్ఛాదనతో రావాలని శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్ (ఎస్ఎస్‌జీటీటీ) పేర్కొంది. స్కర్టులు, దేహం కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ దుస్తులు ధరించి వచ్చిన వారిని ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
కొందరు పాశ్చాత్య వస్త్రధారణతో వస్తుండటం వల్ల కొందరు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రస్ట్ పేర్కొంది. ‘‘ట్రౌజర్లు, చినిగిన దుస్తులు (టోర్న్‌డ్ జీన్స్), పొట్టి స్కర్టులు, పారదర్శక దుస్తులు ధరించి వచ్చే భక్తులను లోపలికి అనుమతించబోం’’ అని ట్రస్ట్ తన ఆదేశాల్లో పేర్కొంది.