- ఫిబ్రవరి 10 లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
- దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమ పాలసీని తయారు చేయాలన్న సీఎం
- ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి సారించాలన్న రేవంత్ రెడ్డి
రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన టూరిజం పాలసీని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమ పాలసీని రూపొందించాలన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ జాతర సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతర సమీపంలోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని అన్నారు.
ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలలో ఎకో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు.