- హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఘటన
- నిందితుడిది వైఎస్సార్ జిల్లా కడపలోని ఖాజీపేట
- జల్సాలు, బెట్టింగ్‌లకు అలవాటు పడటంతో జీతం సరిపోక ఇబ్బందులు
- స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి బంగారు గాజుల చోరీ
నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం వస్తున్నా జల్సాలతో అదంతా హారతి కర్పూరం అయిపోతోంది. దీంతో ఇలా లాభం లేదని చెడుదారి పట్టాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పర్యవసానంగా ఇప్పుడు తీరిగ్గా కటకటాల వెనుక ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన కళాహస్తి హరీశ్‌కృష్ణ గాజుల రామారంలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న హరీశ్‌కృష్ణ బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డాడు. నెలకు వచ్చే రూ.1.10 జీతం జల్సాలు, అప్పులకు సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు.
ఈ క్రమంలో తన కంపెనీలో పనిచేసే కేవీ.మణికంఠతో హరీశ్‌కృష్ణకు పరిచయం ఏర్పడింది. మాదాపూర్ చంద్రానాయక్ తండాలో ఉండే మణికంఠ ఇంటికి పలుమార్లు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూప్ చాటింగ్ ద్వారా ఈ నెల 25న మణికంఠ ఇంట్లో లేడన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు. ఆ రోజు ఉదయం 11.15 గంటలకు ముఖానికి ముసుగు, తలకు హెల్మెట్ ధరించి వారింటికి వెళ్లాడు. మణికంఠ భార్యను కత్తితో బెదిరిస్తూ ఒంటిపైనున్న నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతడిని ప్రతిఘటించడంతో చేతికి గాయమైంది. ఇదే అదునుగా ఆమె చేతి గాజులు లాక్కుని పరారయ్యాడు.
ఈ ఘటనపై మణికంఠ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హరికృష్ణను అనుమానించారు. అదుపులోకి తీసుకుని అతడి ఫోన్‌ను పరిశీలించారు. చోరీ చేసిన గాజులను గాజుల రామారంలోని ఓ దుకాణంలో విక్రయించినట్టు ఫోన్‌లో రసీదు కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. అలాగే, చోరీ చేసిన 20 గ్రాముల బంగారు గాజులు, దోపిడీకి ఉపయోగించిన కత్తి, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.