- సోమవారం సాయంత్రం ఢిల్లీలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం
- శ్లాబ్ కింద పడి కుటుంబం నలిగిపోకుండా అడ్డుకున్న గ్యాస్ సిలిండర్
- ఆ ఖాళీలో ప్రాణాలు అరచేత పట్టుకుని 30 గంటలు గడిపిన కుటుంబం
- ఎట్టకేలకు రక్షించి ఆసుపత్రికి తరలింపు
బహుళ అంతస్తుల భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ కుటుంబం 3 టమాటాలతో 30 గంటలు బతికింది. ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఈ వారం మొదట్లో భవనం కుప్పకూలింది. దీంతో రాజేశ్ (30), ఆయన భార్య గంగోత్రి (26), వారి కుమారులు ప్రిన్స్ (6), రితిక్ (3) శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారి కోసం కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ బుధవారం రాత్రి ముగిసింది. సహాయక సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 30 గంటలపాటు శిథిలాల కింద ఎలా గడిపిందీ రాజేశ్ వివరించాడు. ఇంట్లో మిగిలిన మూడు టమాటాలను తిని ప్రాణాలు నిలుపుకున్నట్టు చెప్పాడు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో భవనం కుప్పకూలింది. ‘‘శిథిలాల కింద మేం చిక్కుకుపోయాం. మాపై ఉన్న శిథిలాలను తొలగించేందుకు చాలా ప్రయత్నించాం. కానీ మా వల్ల కాలేదు. దీంతో దేవుడిపై భారం వేసి అలాగే ఉండిపోయాం. ఇంట్లో మిగిలిపోయిన 3 టమాటాలు కనిపించడంతో వాటిని తిని దాదాపు 30 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాం’’ అని రాజేశ్ వివరించాడు.
తమను బయటకు తీసినప్పుడు తాను స్పృహలో లేనని, ఆసుపత్రికి ఎప్పుడు తరలించారో తనకు తెలియదని రాజేశ్ పేర్కొన్నాడు. కొత్తగా కట్టిన భవనం కూలిన సమయంలో దాని శ్లాబ్ గ్యాస్ సిలిండర్‌పై పడి నిలిచిపోయింది. దీంతో అక్కడ చిన్న ఖాళీ ఏర్పడింది. అదే ఆ కుటుంబ ప్రాణాలను కాపాడింది. శ్లాబ్ కిందపడి వారు నలిగిపోకుండా సిలిండర్ అడ్డుకోవడంతో వారు బతికి బయటపడగలిగారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఐదుగురు మరణించారు. 16 మందిని రక్షించారు.