- 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ. 1,024.30 కోట్లు కేటాయింపు
- కేంద్రమంత్రుల ఖర్చుల కోసం రూ. 619.04 కోట్లు కేటాయింపు
- పీఎంవో పరిపాలనా ఖర్చుల కోసం రూ. 70.91 కోట్లు కేటాయింపు
ప్రధాన మంత్రి కార్యాలయం ఖర్చులు, కేంద్ర మంత్రుల వేతనాలు తదితరాల కోసం 2025-26 కేంద్ర బడ్జెట్‌లో రూ. 1,024.30 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే ఇది ఎక్కువ. కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో కేంద్రమంత్రుల ఖర్చుల కోసం రూ. 619.04 కోట్లు కేటాయించారు. 2024-25లో ఇది రూ. 540.95 కోట్లుగా ఉంది. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల వేతనాలు, ఇతర భత్యాలు, ప్రయాణ ఖర్చులు, వీవీఐపీల కోసం ప్రత్యేక విమాన ప్రయాణాలు వంటి ఖర్చుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు.
జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు 2024-25లో రూ. 270.08 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 182.75 కోట్లకు తగ్గించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయానికి, జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పరిపాలనా ఖర్చులకు రూ. 70.12 కోట్లు కేటాయించారు.
కేబినెట్ సెక్రటేరియట్‌కు రూ. 75.68 కోట్లు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పరిపాలనా ఖర్చులకు రూ. 70.91 కోట్లను కేటాయించారు. 2024-25లో మాదిరిగానే ఆతిథ్యం, వినోద ఖర్చుల కోసం ప్రస్తుత బడ్జెట్‌లోనూ రూ. 4 కోట్లను కేటాయించారు. మాజీ గవర్నర్లకు సెక్రటేరియట్ సహాయం చెల్లింపుల కోసం గతంలో మాదిరిగా రూ. 1.80 కోట్లు కేటాయించారు.