- జాతీయ రహదారిపై సుమారు వంద అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉన్న భారీ ట్యాంకర్
- కాకినాడ పోర్టు నుంచి ఒడిశాలోని బరంపురానికి వెళుతున్న భారీ ట్యాంకర్
- భారీ ట్యాంకర్‌ను ఆసక్తిగా చూస్తున్న ప్రజలు
జాతీయ రహదారిపై భారీ ట్యాంకర్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఈ భారీ ట్యాంకర్ నిలిచి ఉంది. కాకినాడ పోర్టు నుంచి ఒడిశాలోని బరంపురానికి వెళ్తున్న ఈ ట్యాంకర్ దాదాపు 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంది. దీని తరలింపును 20 మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఈ భారీ ట్యాంకర్ జాతీయ రహదారిపై వెళుతుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు, హైవే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మార్గంలో అడ్డుగా ఉన్న స్తంభాలు, బోర్డులను తొలగిస్తున్నారు. రహదారిపై అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్లాల్సి రావడంతో రోజుకు గరిష్టంగా 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తోంది. జాతీయ రహదారిపై ఇది వెళ్తున్న సమయంలో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ట్యాంకర్ ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కొన్నిచోట్ల ఒక మార్గంలోనే ట్రాఫిక్‌ను అనుమతిస్తూ ట్యాంకర్‌ను ముందుకు పంపుతున్నారు. శనివారం రాత్రి నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్దకు చేరుకోగా, అక్కడ ప్రయాణాన్ని నిలిపివేశారు. తిరిగి ఆదివారం ప్రయాణం కొనసాగుతుందని హైవే అధికారులు తెలిపారు.