- ఇజ్రాయెల్ భీకర దాడులకు గాజా అతలాకుతలం
- అస్తవ్యస్తంగా మారిన పౌరుల జీవనం
- నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు ఆశ్రయం కల్పించాలన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరబ్ దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాజాగా చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ భీకర దాడులకు గాజా అతలాకుతలమైన విషయం తెలిసిందే. పౌరుల జీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్ట్, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈ మేరకు ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
పాలస్తీనీయులకు పునరావాసం కల్పించడానికి చేసే ప్రణాళికను తాము అంగీకరించలేమని తేల్చి చెప్పాయి. ఎందుకంటే.. అలా చేసినట్లయితే ఆయా ప్రాంతాల్లోని స్థిరత్వాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ విస్తరించే ప్రమాదం కూడా లేకపోలేదన్నాయి. తద్వారా ప్రజలకు శాంతియుతంగా జీవించడం కష్టంగా మారుతుందని పేర్కొన్నాయి.