- ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో భారత్ విక్టరీ
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసిన భారత్
- ఛేజింగ్ లో 10.3 ఓవర్లలో 97 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
మొదట కళ్లు చెదిరే స్కోరు సాధించిన టీమిండియా… ఆ తర్వాత ఇంగ్లండ్ ను కుప్పకూల్చింది. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదట నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేయడం ఈ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. ఇక, 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ లో 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 55 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో జాకబ్ బెతెల్ 10 పరుగులు చేశాడు. సాల్ట్, బెతెల్ మినహా మరెవ్వరూ డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లతో సత్తా చాటడం విశేషం. ఆఖర్లో షమీ వరుస బంతుల్లో అదిల్ రషీద్ (6), మార్క్ ఉడ్ (0)లను అవుట్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే 2, అభిషేక్ శర్మ 2, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.
ఇక టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించడమే కాకుండా, బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 4-1తో ముగించింది. ఇక, టీమిండియా-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగపూర్ లో, రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్ లో, మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లో జరగనున్నాయి.