- మారిన జీవన శైలితో చాలా మందిలో మధుమేహం సమస్య
- తెలియకుండానే ఒళ్లు గుల్ల చేస్తున్న సైలెంట్ కిల్లర్
- రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్న నిపుణులు
మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం (షుగర్) వ్యాధి బారినపడుతున్నారు. ఈ సమస్య ముదిరేవరకు కూడా చాలా మంది దీనిని గుర్తించడం లేదు. షుగర్ వ్యాధి కారణంగా శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతినడం, గుండె జబ్బుల దాకా వెళ్లడం వంటివీ కొందరిలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో షుగర్ కారణంగా రాత్రిపూట మన శరీరంలో కనిపించే కొన్ని రకాల లక్షణాలను గుర్తించడం ద్వారా జాగ్రత్తపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి ఆకలి వేయడం…
రాత్రి నిద్రకు ముందు భోజనం చేసినా కూడా.. మధ్య రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఆకలి వేయడం షుగర్ బారినపడ్డారనే దానికి సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం…
తగిన వెంటిలేషన్, గాలి ఉన్నా కూడా రాత్రిపూట పరిమితికి మించి చెమటలు పట్టడం కూడా డయాబెటిస్ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయాక రక్తంలో షుగర్ స్థాయుల్లో తీవ్ర హెచ్చుతగ్గులే ఇలా చెమటలు పట్టడానికి కారణం కావొచ్చని పేర్కొంటున్నారు.
రాత్రి నిద్ర మధ్యలో మేల్కొన్నప్పుడు… కళ్లు మసకగా కనిపించడం
నిద్రపోయిన తర్వాత మధ్య రాత్రి బాత్రూమ్ కనో, మరేదో ఆందోళనతోనో మేల్కొంటే… ఆ సమయంలో కళ్లు మసక (బ్లర్)గా కనిపించడం షుగర్ వ్యాధి లక్షణమని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయులు హెచ్చుతగ్గులతో కంటి చూపుపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.
అర్ధరాత్రి తిమ్మిర్లు, పట్టేయడం…
నిద్రపోయిన తర్వాత ఉన్నట్టుండి శరీరంలోని పలు భాగాల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్టుగా భావన, పట్టేసినట్టుగా ఉంటుండటం మధుమేహం సమస్యకు లక్షణాలని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా పాదాలు, చేతుల వద్ద తిమ్మిర్లు కనిపిస్తాయని… షుగర్ స్థాయుల్లో తీవ్ర హెచ్చుతగ్గులతో నాడుల పనితీరు దెబ్బతినడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
సరిగా నిద్రపట్టకపోవడం… తరచూ మేల్కోవడం..
రాత్రిపూట మంచి వాతావరణంలో నిద్రపోయినా తరచూ మేల్కొంటూ ఉండటం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటివి షుగర్ వ్యాధి లక్షణాలు కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయుల్లో తేడాలే ఈ సమస్యకు దారి తీస్తాయని వివరిస్తున్నారు.
దాహం వేస్తూ ఉండటం…
రాత్రి నిద్రకు ముందు తగిన స్థాయిలో నీళ్లు తాగినా కూడా… అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా దాహం వేయడం, నీళ్లు తాగి పడుకున్నా మళ్లీ కాసేపటికే దాహం వేయడం వంటివి మధుమేహం లక్షణాలు అని నిపుణులు వివరిస్తున్నారు.
తరచూ మూత్రం రావడం…
రాత్రిపూట తరచూ మూత్రం రావడం, దానికోసం మెలకువ రావడం కూడా షుగర్ వ్యాధి లక్షణాలని నిపుణులు తేల్చి చెబుతున్నారు. రక్తంలో అధికంగా షుగర్ చేరుతుండటంతో ఈ సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పైన చెప్పిన లక్షణాలు కేవలం షుగర్ తోనే కాకుండా ఇతర వ్యాధులతోనూ వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల సమస్య ఏదయినా సరే… ముందుగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.