- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి
- రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వేశాఖ
- రైలు ప్లాట్‌ఫాంపైకి వచ్చే వరకు ప్రయాణికులకు లోపలికి అనుమతి నిల్
- నిన్న ఒక్క రోజే ప్రయాగ్‌రాజ్‌కు 1.36 కోట్ల మంది
- ఇప్పటి వరకు మొత్తం 52.83 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు
కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే స్టేషన్లు రద్దీతో నిండిపోతున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించిన నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. లౌడ్ స్పీకర్లలో ఎప్పటికప్పుడు రైళ్ల సమాచారానికి సంబంధించిన ప్రకటనలు చేస్తోంది. ఢిల్లీతోపాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రైలు ప్లాట్‌ఫాం మీదికి వచ్చే వరకు ప్రయాణికులను అనుమతించడం లేదు. స్టేషన్ బయట బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయోధ్య రైల్వే స్టేషన్‌కు ప్రతి రోజు లక్షన్నర మంది వస్తున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో వీరి కోసం ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో అయోధ్య వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ఫ్లాట్‌ఫాం నంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి 1.36 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 52.83 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినట్టు పేర్కొంది. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రదేశాల్లో పోలీసులతోపాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.