- కక్ష సాధింపు చర్యకు అద్దం పట్టేలా వంశీ అరెస్టన్న జగన్
- గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంపై సత్యవర్ధన్ ఫిర్యాదు
- వంశీ తప్పులేదని న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చాడన్న జగన్
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా… అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తుచేశారు.
అదే సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలం ఇస్తూ.. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిట్టించారని జగన్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో తిడుతూ పట్టాభి రెచ్చగొట్టారని చెప్పారు. గన్నవరం వెళ్లి సవాళ్లు విసిరారని గుర్తుచేశారు.
ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని, రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు.
అప్పట్లో చేసిన ఫిర్యాదులో వల్లభనేని వంశీ పేరులేదని గుర్తుచేశారు. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో వంశీ అక్కడలేరని వివరించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వల్లభనేని వంశీని టార్గెట్ చేశారని జగన్ ఆరోపించారు. ఎలాగైనా వంశీని ఇరికించాలనే కుట్రతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రీఓపెన్ చేసి, వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు.
వంశీ ఎట్టిపరిస్థితిలోనూ బెయిల్ పై బయటకు రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే… గన్నవరం ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై కేసు పెట్టారని జగన్ విమర్శించారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు.
వల్లభనేని వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు

కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్…. విమానాశ్రయం నుంచి నేరుగా జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిసి, పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు.