- 360 ఏళ్ల వ్యక్తి బతికే ఉన్నట్లు చూపుతున్న ప్రభుత్వ లెక్కలు
- రెండు వందళ ఏళ్లు పైబడిన వారు 2 వేల మంది ఉన్నట్లు రికార్డులు
- సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ డేటా సవరించకపోవడంపై విమర్శ
అమెరికా ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ (ఎస్ఎస్ఏ) లబ్ధిదారుల డేటాను సవరించకపోవడంపై ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఏకంగా ఓ వ్యక్తికి 360 ఏళ్లుగా చూపడంపై విమర్శలు గుప్పించారు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ రికార్డుల ప్రకారం.. అమెరికాలో 100 ఏళ్ల నుంచి 200 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.30 కోట్ల మంది, 200 ఏళ్లు పైబడిన వారు 2 వేల మంది ఉన్నారంటూ మస్క్ ఎద్దేవా చేశారు. అమెరికా జనాభా కన్నా ఎస్ఎస్ఏ లబ్ధిదారుల సంఖ్యే ఎక్కువగా ఉండడం వింతల్లోకెల్లా వింత అంటూ ట్వీట్ చేశారు.
అయితే, మస్క్ ఆరోపణలను ఎస్ఎస్ఏ అధికారులు తోసిపుచ్చారు. ఆ లిస్టులోని ఉన్న వాళ్లలో వందేళ్లు ఆపైన ఉన్న వారు ప్రభుత్వం నుంచి జీవన భృతి తీసుకోవడం లేదని చెప్పారు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరించారు.
మస్క్ ఆరోపణలు ఇవే…
ప్రభుత్వ చెల్లింపులలో దుబారాను అరికట్టి పొదుపు మంత్రం పాటించేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరుతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థకు ఎలాన్ మస్క్ ను చీఫ్ గా నియమించారు. తాజాగా ప్రభుత్వం డోజ్‌కు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమాచారం చూసేందుకు యాక్సెస్ ఇచ్చింది. దీంతో ట్రెజరీ చెల్లింపులను పరిశీలించిన మస్క్ కార్యవర్గం… సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ జాబితాపై దృష్టిపెట్టింది.
ఈ జాబితాను చాలాకాలంగా సవరించలేదని, అనర్హుల పేర్లు, ఎప్పుడో చనిపోయిన వారి పేర్లు ఇంకా లిస్ట్ లో ఉన్నాయని మస్క్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన లెక్కలతో మస్క్ ఓ ట్వీట్ చేశారు. అమెరికా జనాభా కన్నా సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితాలోని పేర్లే ఎక్కువగా ఉన్నాయని, చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసమని మస్క్ విమర్శించారు.
ఏంటీ ఎస్ఎస్ఏ…?
అమెరికాలో అంగవైకల్యంతో బాధపడేవారికి, పదవీ విరమణ పొందిన వారికి, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నెలనెలా చెల్లించే జీవన భృతినే సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ గా వ్యవహరిస్తారు. వయసు పైబడిన కారణంగా పనిచేసే ఓపిక లేనివారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. ఫుడ్ కూపన్లు, నగదు రూపంలో ప్రభుత్వం వీరికి సాయం చేస్తుంది.