- నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం
- సీఈసీ, ఈసీ ఎంపిక కోసం మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం
- కమిటీ సూచించిన పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
- 2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగనున్న జ్ఞానేశ్ కుమార్
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవులను చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. త్రిసభ్య కమిటీలో మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన విడుదలైంది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవే కావడం గమనార్హం.
61 ఏళ్ల జ్ఞానేశ్వర్ కుమార్ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిరుడు మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గతేడాది జనవరిలో సహకార శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. సీఈసీగా ఎన్నికైన ఆయన 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరల్లో బీహార్, వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఎన్నికల అధికారిగా నియమితులైన వివేక్ జోషి 1989 హర్యానా క్యాడర్‌కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆ ఇంట్లో ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, వైద్యులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఫ్యామిలీ సో స్పెషల్!

- జ్ఞానేశ్ 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి
- ఆయన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్లు ఐఏఎస్ అధికారులే
- జ్ఞానేశ్ తండ్రి సుబోధ్ గుప్తా వైద్యుడు
ఇంట్లో ఒక ఐఏఎస్ అధికారో.. ఐపీఎస్ అధికారో ఉంటే సహజంగానే ఉబ్బితబ్బిబ్బవుతాం. బంధుమిత్రగణంలో గర్వంగా ఫీలవుతాం. మరి.. ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు ఉంటే.. ? అందునా అదే కుటుంబంలో ఏకంగా 28 మంది వైద్యులు ఉంటే..?
అవును.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా నియమితులైన మాజీ ఐఏఎస్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఇంట్లో ఇలా అంతా ఉన్నతాధికారులు, ఉన్నత వృత్తుల్లో ఉన్నవారే. ఆయన పెద్ద కుమార్తె మేధా రూపం, ఆమె భర్త 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. మేధా ప్రస్తుతం యూపీలోని కాస్‌గంజ్ జిల్లా కలెక్టర్ గా సేవలందిస్తున్నారు. ఆమె భర్త మనీశ్ బన్సల్ యూపీలోని సహరన్ పూర్ కలెక్టర్ గా నియమితులయ్యారు.
జ్ఞానేశ్ రెండో కుమార్తె అభిశ్రీ ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె భర్త అక్షయ్ లబ్రూ ఐఏఎస్ ఆఫీసర్. జ్ఞానేశ్ సోదరుడు మనీశ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్సే. మనీశ్ సోదరి రోలి ఇండోర్‌లో ఒక పాఠశాల నడుపుతున్నారు. జ్ఞానేశ్ కుమార్ గుప్తా పుట్టింది యూపీలోని ఆగ్రాలో. ఆయన తండ్రి సుబోధ్ గుప్తా. తల్లి సత్యవతి. సుబోధ్ గుప్తా సహా ఆయన కుటుంబంలో 28 మంది వైద్యులు ఉన్నట్లు వారి ఇరుగు పొరుగు చెబుతున్నారు.
కాగా, 1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ తొలుత తిరువనంతపురంలో జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2007 నుంచి 2012 వరకు, ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రమూక హింసాత్మక చర్యలకు తెగబడటంతో అక్కడి నుంచి 183 మంది భారతీయులను స్వదేశానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారు. 2014 లో ఆయన ఢిల్లీలో కేరళ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు.