- అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్న ఆరోగ్య నిపుణులు
- తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట
- తులసి ఆకులు నానబెట్టిన నీళ్లతో దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం
బెడ్ మీద నుంచి లేవగానే కాఫీయో టీయో కడుపులోకి పంపిస్తున్నారా..? ఇకపై వాటిని పక్కన పెట్టి ఇంట్లోనే ఈ డ్రింకులు తాగి చూడండి. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదనపు బరువును వదిలించుకుని స్లిమ్ గా, ఫిట్ గా కనిపించవచ్చని సూచిస్తున్నారు. వంటింట్లోని దినుసులతో సింపుల్ గా తయారు చేసుకునే ఈ డ్రింక్ లతో ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
తేనె
గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె, మరికాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి చేరే హానికారక బ్యాక్టీరియాను తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు బయటకు తరిమేస్తాయని తెలిపారు. రోజూ పరగడుపున తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చని చెప్పారు.
దగ్గు, జలుబు వేధిస్తుంటే..
వంటింట్లోని వెల్లుల్లి పకృతి ప్రసాదించిన యాంటీ బయోటిక్.. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆపై గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చని చెప్పారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు చెక్ పెట్టవచ్చని వివరించారు.
ఉసిరి గుజ్జు..
విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో ఉసిరి గుజ్జును కలుపుకొని తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
తులసి ఆకులను నానబెట్టి..
రాత్రిపూట ఐదు తులసి ఆకులను గ్లాసుడు నీళ్లలో నానబెట్టి తెల్లవారి లేచాక తాగితే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుందని నిపుణులు చెప్పారు. జుట్టు, దంతాలకు మేలు కలుగుతుందని వివరించారు. నానబెట్టిన తులసి ఆకులను నమిలి, ఆ నీటిని తాగితే దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చని తెలిపారు.