కేసీఆర్ నుంచి ప్రాణభయముంటే ప్రభుత్వాన్ని సంప్రదించండి: మంత్రి కోమటిరెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై గాంధీభవన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని అన్నారు. న్యాయపరంగా వెళ్లాలి కానీ.. చంపేస్తారా అని ప్రశ్నించారు.
మంత్రి కోమటిరెడ్డి ఇంకా మాట్లాడుతూ.. “కేసీఆర్, ఆయన కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది. వారి అక్రమాలను బయటపెడితే చంపేస్తారా? రూ. కోట్లు పోతే సంపాదించుకోవచ్చు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడాడు. ఆయన హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. కేసీఆర్ పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్‌గౌడ్ కు రక్షణ కల్పిస్తాం. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలి” అని కోమటిరెడ్డి అన్నారు.
అందుకే చంద్రబాబు నీళ్లను తరలించుకుపోతున్నారు: హరీశ్ రావు

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నీళ్లు తెస్తారో లేదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాల దోపిడీ అంశంపై ఆయన మాట్లాడారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీజేపీ అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా పరిణమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నీటి కోసం ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి కూడా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా జలాలు దోపిడీకి గురవుతుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పదవులు ఎందుకని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీ కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు.
ఆరోజు జగన్‌తో కేసీఆర్ స్నేహంగా మెలిగారు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో స్నేహంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి సహకరించారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఏపీ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కృష్ణా జలాల్లో 500 టీఎంసీల కోసం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా, అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ, బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, మేడిగడ్డ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు.
రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే గండ్ర

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర మాట్లాడుతూ… రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ హత్యతో తనకు కానీ, బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని… హత్యపై సీబీఐతో లేదా సీఐడీతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాజలింగమూర్తి హత్యపై డీఎస్పీ సంపత్ రావు ఏమన్నారంటే?

రాజలింగమూర్తి హత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సంపత్ రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని గతంలో కేసు వేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు.
నిన్న తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాజలింగమూర్తి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కార్యాలయం ఎదురుగా నలుగురు నుండి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనను చుట్టుముట్టి, కత్తులు, గొడ్డళ్లతో నరికారు.
రాజలింగమూర్తి హత్యపై డిఎస్పీ మాట్లాడుతూ, ఈ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. హత్య వెనుక ఉన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయని, హత్యకు ఇతర కారణాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.