స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో కుప్పకూలిన విద్యార్ధిని
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెదనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
నిన్న ఉదయం పాఠశాలకు బయలుదేరిన శ్రీనిధి స్కూలు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే శ్రీనిధి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.