- గతేడాది చివర్లో ఆర్బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన శక్తికాంత దాస్
- కీలక పదవి అప్పగించిన కేంద్రం
- మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్
గతేడాది డిసెంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా పదవీ విరమణ చేసిన శక్తికాంత దాస్ కు కీలకపదవి లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్ ను ప్రధాని నరేంద్ర మోదీ 2వ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ టర్మ్ లో మోదీ ప్రధాని పదవిలో ఎంతకాలం కొనసాగితే, శక్తికాంత దాస్ కూడా అంత కాలం పాటు ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవీకాలంపై ఇదే నిబంధన వర్తిస్తుంది. శక్తికాంత దాస్ తాజా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన నియామకం అధికారికంగా పరిగణనలోకి వస్తుంది.
ప్రధాని మోదీ 2వ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీకి ఇప్పటికే ప్రమోద్ కుమార్ మిశ్రా ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.