- ఏపీలో 175 నియోజకవర్గాల పనితీరుపై ప్రభుత్వ ర్యాంకులు
- 93 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
- రెండో స్థానంలో నిలిచిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గం గాజువాక
- A+ గ్రేడులో 21, A గ్రేడులో 153, B గ్రేడులో ఒకే ఒక్క నియోజకవర్గం
- ఎమ్మెల్యేల పనితీరు, పథకాల అమలు ఆధారంగా ర్యాంకుల కేటాయింపు
ఏపీలో ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే నిర్వహించి, వాటికి ర్యాంకులు, గ్రేడులు కేటాయించారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సంతృప్తి వంటి అంశాల ఆధారంగా చేపట్టిన ఈ సర్వేలో 93 శాతం మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గానికి బీజేపీ నేత సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో 92 శాతం మార్కులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం రెండో స్థానాన్ని దక్కించుకుంది. కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ పథకాల అమలు, శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండటం, ఫైళ్ల పరిష్కారం వంటి పలు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలను A+, A, B గ్రేడులుగా విభజించారు. వీటిలో 21 నియోజకవర్గాలు A+ గ్రేడులో, 153 నియోజకవర్గాలు A గ్రేడులో ఉండగా, కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే B గ్రేడులో నిలవడం గమనార్హం.
పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు, తాజాగా ఆయన నియోజకవర్గం పనితీరులోనూ రెండో స్థానంలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పనితీరును మరింత మెరుగుపరచుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: