- ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమేనన్న బొత్స
- రైతు సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శ
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని వ్యాఖ్య
ఏపీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జగన్ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోగా… అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని చెప్పారు. సభలో ఉన్నది రెండే పక్షాలని… ఒకటి అధికారపక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
రైతుల సమస్యలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని… కేంద్రంతో మాట్లాడుతున్నామని, సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే చెపుతున్నారని బొత్స విమర్శించారు. అందుకే ప్రజలు, రైతుల కష్టాలు చెప్పేందుకు తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని వివరించారు.
రైతుల సమస్యలపై పోరాడుతున్న తమపై కేసులు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూసిన తర్వాతే తమ తదుపరి చర్య ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని తెలిపారు.