జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోనళ తప్పదు ..కె. రాంనారాయణ
-మార్చిలో టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో
28 నుంచి సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమం
జర్నలిస్టుల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణిని
అవలంభిస్తుందని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ ఆరోపించారు. అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాల సమస్యలతో పాటు ఇతర సమస్యలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
టియుడబ్ల్యూజె (ఐజెయు) స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఖమ్మం లో జరిగింది. ఈ సమావేశంలో రాంనారాయణ మాట్లాడుతూ ఒక పక్క జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే మరో పక్క సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాజీ ధోరణిని అవలంభించబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన అక్రిడేషన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. హెల్త్ కార్డుల సమస్య కూడా పెండింగ్లో ఉందని పలువురు జర్నలిస్టులు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మంజిల్లా మహాసభలను మార్చి చివరి వారంలో వైరాలో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు మాటేటి వేణుగోపాల్ కన్వీనర్ గా క్రమశిక్షణ కమిటీని, మైసా పాపారావు కన్వీనర్గా, సభ్యత్వ స్కూట్ని కమిటీని ఏనుగు వెంకటేటేశ్వరరావు కన్వీనర్ మహాసభల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలువురు జర్నలిస్టులను ఈ కమిటీ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాట కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర బాధ్యులు నర్వనేని వెంకట్రావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు, జిల్లా కోశాధికారి శివానంద, ఖమ్మం నియోజక వర్గ అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.