- 4 నిమిషాల్లో రూ.29 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాలలో ఘటన
- వైరల్ గా మారిన సీసీటీవీ ఫుటేజీ
కారులో వచ్చిన ముసుగు దొంగలు నాలుగు నిమిషాల్లో ఏటీఎంను గుల్ల చేశారు. గ్యాస్ కట్టర్లతో మెషిన్ ను కోసి రూ.29 లక్షలు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ దొంగతనం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కా ప్లానింగ్ తో చోరీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కట్ చేశారు.
గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టి, నగదు పెట్టెతో సహా ఉడాయించారు. ఇదంతా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే జరిగిందంటే దొంగలు ఎంత ప్లానింగ్ తో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే రూ.30 లక్షల నగదును ఉంచినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వారే పక్కా ప్లాన్ తో చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.