పేదల స్థలాల జోలికొస్తే సహించం – సీపీఐ (ఎం)
ఇళ్ల స్థలాల బై బ్యాక్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడించిన సీపీఐ (ఎం)
ముట్టడి ఉద్రిక్తం, తోపులాట
కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బాధితులు
పోలీసులకు, సిపిఎం కార్యకర్తలకు వాగ్వివాదం.
శివాయిగూడెం కొత్త కాలనీ సమస్యలు పరిష్కరించాలి.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం కొత్త కాలనీ సమస్యలు పరిష్కరించాలని,
మరియు 900 మంది పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల బై బ్యాక్ కు వ్యతిరేకంగా సీపీఐ (ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన ఇళ్లసలాల బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన ఉద్రిక్తమైంది. ముట్టడికి వచ్చిన సిపిఎం శ్రేణులు, ప్రజలు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నుండి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు మరియు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇళ్ల స్థలాలను గుంజుకోవద్దంటూ నినాదాలు చేశారు.
ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పేదల ఇండ్ల స్థలాల జోలికి వస్తే సహించబోమని అన్నారు. రఘునాథపాలెం మండలంలోని ఈ కాలనీలో పేదల ఇళ్ల స్థలాల బై బ్యాక్ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ఇచ్చిన స్థలాలను గుంజుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ జోక్యం చేసుకొని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఆటంకాలు కల్పించవద్దని అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ అనేక దఫాలుగా నిర్వహించిన పోరాటాల ఫలితంగానే గతంలో ఖమ్మం నగరంలోని పేదలకు రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం రెవిన్యూ లో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని అన్నారు. 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగరానికి అతి సమీపాన ఉన్న రఘునాధపాలెం మండలంలో పేదలకు కరెంటు లేకుండా నీటి సౌకర్యం లేకుండా జీవిస్తున్నారని వారు తెలియజేశారు. వెంటనే కాలనీలో
మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని పైపులైన్లు వేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, ఎంఏ జబ్బార్, షేక్ మీరా సాహెబ్, మండల కార్యదర్శి భూక్య శ్రీనివాస్, షేక్ నాగుల్ మీరా, డివిజన్ నాయకులు షేక్ సైదులు, యర్రా రంజిత్, గుగులోత్ కుమార్ , కూరపాటి శ్రీనివాస్, ప్రజా సంఘాల జిల్లా నాయకులు చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.