Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అప్పుడు 3, ఇప్పుడు 2… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్!

  • 2023లో 3 గ్రాడ్యుయేట్ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ
  • తాజాగా మరో రెండు స్థానాల్లో గెలుపు
  • మొత్తం 5 గ్రాడ్యుయేట్ స్థానాలు టీడీపీ ఖాతాలోకే!

గత కొన్నేళ్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ జోరు మామూలుగా ఉండడంలేదు. 2023లో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే… మూడు స్థానాలు టీడీపీనే కైవసం చేసుకుంది. ఇప్పుడు, తాజాగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆ రెండింటినీ కూడా టీడీపీనే చేజిక్కించుకుంది. దాంతో రాష్ట్రంలోని ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను సైకిల్ క్లీన్ స్వీప్ చేసింది. 

తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగ్గా… నిన్న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉమ్మడి కష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో  కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నెగ్గారు. ఆయన 82,320 ఓట్ల భారీ మెజారిటీతో విజయభేరి మోగించారు. ఏడో రౌండ్ కల్లా ఆయన విజయానికి అవసరమైన ఓట్లను పొందారు. 

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లను ఆయన సాధించారు. 

అంతకుముందు… 2023లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి… తూర్పు రాయలసీమ (ఉమ్మడి చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్… పశ్చిమ రాయలసీమ (కడప-కర్నూలు-అనంతపురం) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘనవిజయం సాధించారు. మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల కూడా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోకే వస్తుంది. ఆ నియోజకవర్గంలోనూ భూమిరెడ్డికి గణనీయంగా ఓట్లు పోలయ్యాయి. 

అప్పుడు 2023లో మూడు…. ఇప్పడు 2025లో రెండు… మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. ఈసారి మరో రికార్డు కూడా నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి పడిన ఓట్లు 10 శాతం పెరిగాయి.

Related posts

ఉద్యోగులకు తీపి కబురు … సెలవైన ,ఆదివారమైనా 1 తేదీనే జీతం డబ్బుల ఖాతాల్లో జమ!

Drukpadam

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు స్పందన మామూలుగా లేదు!

Ram Narayana

ఏపీ అధికారిని అడ్డగించిన ఒడిశా ఎమ్మెల్యే.. అధికారికి మద్దతుగా నిలిచిన గిరిజనులు!

Drukpadam

Leave a Comment