గుజరాత్ ప్రజల మనస్సులు గెలుచుకోండి ..కార్యకర్తలతో రాహుల్ గాంధీ
ఓట్లు అడిగే ముందు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి
గుజరాత్ లో అధికారం కోల్పోయి 30 ఏళ్లయింది
కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసిన గుజరాత్ నేతలు
మన వైఫల్యాల వల్లనే ఓడిపోతున్నాం
పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది
కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓట్లు అడిగే ముందు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారంనాడు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దాదాపు 30 ఏళ్లుగా మనం గుజరాత్‌లో అధికారానికి దూరంగా ఉండిపోయామని అన్నారు.
”నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా 2007, 2012, 2017, 2022, 2027..అంటూ ఎన్నికలపైనే చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఎన్నికలు కాదు. మనం మన బాధ్యతలను నిర్వర్తించనంత వరకూ గుజరాత్ ప్రజలు మనను గెలిపించరు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించనంత వరకూ మాకు అధికారం ఇమ్మని ప్రజలను అడగలేం. ఆ పని మనం చేయగలిగితే గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలడతారని నేను కచ్చితంగా చెప్పగలను” అని రాహుల్ అన్నారు.
స్వాంతంత్రోద్యమంలో గుజరాత్ కీలక భూమిక
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గుజరాత్ కీలక పాత్ర వహించిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ”బ్రిటిష్ వారిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నాయకత్వం కోసం ఎదురుచూశాం. ఓవైపు బ్రిటిష్ వారు, వారిని ఎదుర్కొనేందుకు దేశం తరఫున కాంగ్రెస్ పార్టీ నిలిచింది. నాయకుడు లేడు. అప్పుడు నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. ఆయనే మహాత్మాగాంధీ. గాంధీని మనకు ఎవరు ఇచ్చారు? దక్షిణాఫ్రికా కాదు, గుజరాత్. కాంగ్రెస్ పార్టీకి ఒరిజనల్ నాయకత్వాన్ని గుజరాత్ ఇచ్చింది. ఆ నాయకత్వమే మనకు, దేశానికి, గుజరాత్‌కు దిశానిర్దేశం చేసింది. గాంధీ లేకుండా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తేగలిగి ఉండేది కాదు” అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న ఐదుగురు పెద్ద నేతల్లో ఇద్దరు నేతలను గుజరాత్ ఇచ్చిందని చెప్పారు.
గుజరాత్‌కు సరైన మార్గం చూపగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల అభిమానం చూరగొంటుందని రాహుల్ అన్నారు. గత 30 ఏళ్లుగా గుజరాత్ ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ కానీ, పీసీసీ అధ్యక్షుడు కానీ, ఇన్‌చార్జులు కానీ. చివరకు తాను కానీ బాధ్యతలు నిర్వహించలేకపోయినట్టు చెప్పారు. గుజరాత్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, చిన్న వర్తకులు, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు గుజరాత్‌కు వెన్నెముక అని, వారు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారని, కొత్త విజన్ కోసం రైతులు ఆవేదనతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తగిన విజన్ అందించగలదని, కానీ మొదట సంస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని రాహుల్ అన్నారు.
40 శాతం ఓటింగ్ షేర్ ఉంది
గుజరాత్‌లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటింగ్ షేర్ ఉందని, గెలవడానికి కేవలం మరో 5 శాతం ఓటింగ్ షేర్ అవసరమని రాహుల్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 22 శాతం ఓటింగ్ షేర్ పెంచుకుందని, ఇక్కడ (గుజరాత్)కూడా ఆ పని చేయవచ్చని, అయితే పార్టీని ప్రక్షాళన (ఫిల్టర్) చేయకుండా అది సాధ్యం కాదని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తిరిగి ప్రజలకు చేరువై వారికి భరోసాగా నిలవాలని అన్నారు. కార్యకర్తల్లోని సత్తాని వెలికితీసేందుకు తాను ముందుంటానని రాహుల్ దిశానిర్దేశం చేశారు.