- మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- హైవేలు మూసేసిన అధికారులు
- నగరాన్ని దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కార్చిచ్చు చెలరేగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సిటీని దట్టంగా పొగ కమ్మేసింది. లాంగ్ ఐలాండ్ లోని హోంఫ్టన్స్ లో శనివారం మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి 50 శాతం అగ్ని కీలలను ఆర్పేశారు. కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో పలు హైవేలను అధికారులు మూసేశారు. వాహనాలను ఆయా మార్గాల్లో అనుమతించడంలేదు. హోంప్టన్స్‌లో ఉదయం నాలుగు చోట్ల ఎగిసిపడ్డ మంటలు మధ్యాహ్నానికి మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్ హోంప్టన్స్ సహా పలు ప్రాంతాలకు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ నివాస సముదాయాలకు నిప్పంటుకోలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కార్చిచ్చుతో సిటీలోని పలు ప్రాంతాలను పొగ కమ్మేయడంతో న్యూయార్క్ గవర్నర్ ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్లతో నీటిని చల్లుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు.