- దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకూడదని కోరుకుంటానన్న ఏపీ డిప్యూటీ సీఎం
- సీట్లు తగ్గవని ఎన్డీయే కూటమి సభ్యుడిగా హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
- నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రాలేదని గుర్తుచేసిన జనసేనాని
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని, డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్ లో దక్షిణాది ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇటీవల చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఆయన అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదని గుర్తుచేశారు. ఈ విషయంలో ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయని చెప్పారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకూడదని తాను కూడా కోరుకుంటానని అన్నారు. అదేసమయంలో ఎన్డీయే కూటమి సభ్యుడిగా దక్షిణాదికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి సీట్లు తగ్గవని స్పష్టం చేశారు. దక్షిణాది ప్రజలపై కేంద్రం హిందీ భాషను రుద్దుతోందనే ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రజలపై బలవంతంగా ఇతర భాషలను రుద్దే ప్రయత్నాన్ని తాను కచ్చితంగా వ్యతిరేకిస్తానని తేల్చిచెప్పారు. తాను ఎన్నడూ మాట మార్చలేదని వివరించారు.