- మురుగునీటి ట్రక్కుల సేకరణలో కుంభకోణం జరిగిందని ‘సువుక్కు’ శంకర్ ఆరోపణ
- పారిశుద్ధ్య కార్మికుల వేషధారణలో ఇంటికి వచ్చి బీభత్సం
- ఇప్పటికి ఇక్కడితో వదిలేస్తున్నామని, మరోసారి తగలబెట్టేస్తామని హెచ్చరిక
- సిటీ పోలీస్ కమిషనర్ కనుసన్నల్లోనే దాడి జరిగిందని శంకర్ ఆరోపణ
- సీబీ-సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
తమిళనాడులో ఓ యూట్యూబర్ ఇంటిని ధ్వంసం చేసిన కొందరు వ్యక్తులు.. ఆపై చెత్తాచెదారం, మానవ మలాన్ని ఇంట్లో పారబోశారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. క్రైం బ్రాంచ్-క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీబీ-సీఐడీ)తో దర్యాప్తునకు ఆదేశించింది.
రాజకీయ వ్యవహారాలపై తన అభిప్రాయాలను పంచుకొనే యూట్యూబర్ ‘సువుక్కు’ శంకర్ ఇంటిపై పారిశుద్ధ్య కార్మికుల వేషధారణలో వచ్చిన 20 మంది మహిళలు, పురుషులు సోమవారం కిల్పాక్‌లోని శంకర్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో శంకర్ ఇంట్లో లేరు. ఆయన తల్లి కమల ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. తలుపులు తోసుకుని బలవంతంగా లోపలికి వచ్చిన నిందితులు ఇంటిని ధ్వంసం చేశారని కమల ఆరోపించారు. అలాగే, మానవ మలంతో కూడిన మురుగునీరు, చెత్తను ఇంటి ఆవరణలో పడేసినట్టు ఆరోపించారు. వెళ్తూవెళ్తూ.. ‘‘ఇప్పటికి ఇక్కడితో వదిలేస్తున్నాం. మరోసారి ఇంట్లో నిన్ను తగలబెట్టేస్తాం’’ అని హెచ్చరించినట్టు ఆమె పేర్కొన్నారు.
మురుగునీటి ట్రక్కుల సేకరణలో భారీ కుంభకోణం జరిగిందని శంకర్ ఇటీవల తన వీడియోలో ఆరోపించారు. తమ ఇంటిపై దాడికి ఇదే కారణమై ఉంటుందని కమల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడికి సీనియర్ సిటీ పోలీసు అధికారులే కుట్ర పన్నారని శంకర్ సంచలన ఆరోపణ చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ ఆదేశాల మేరకే తన ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించిన శంకర్.. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దుండగులు తన ఇంటిపై దాడికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని కుమారుడికి చెప్పేందుకు ప్రయత్నించానని, అయితే, వారు తన ఫోన్‌ను లాగేసుకున్నారని ఆమె తెలిపారు. కాగా, శంకర్ ఇంటిని ధ్వంసం చేసిన నిందితులు అనంతరం.. ఆయనను అరెస్ట్ చేయాలని ఇంటి బయట ధర్నా చేశారు.