కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల భార్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్, ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. సీతంపేటకు చెందిన దివ్య(30)కు, చంద్రశేఖర్‌కు 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న దివ్య, ఈ నెల 18న ఇంట్లో గన్నేరు పువ్వులు, ఆకులు కలిపి మిక్సీలో వేసుకుని తాగింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
అయితే, దివ్య మరణానికి చంద్రశేఖరే కారణమని ఆరోపిస్తూ ఆమె అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో దివ్య తండ్రే జోక్యం చేసుకుని గ్రామస్తులను నివారించడం గమనార్హం.
భార్య మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర వేదనకు గురైన చంద్రశేఖర్, ఇవాళ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: