- ఉచిత పాస్‌ల కోసం సన్‌రైజర్స్‌పై హెచ్‌సీఏ ఒత్తిడి
- అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని ఎస్ఆర్‌హెచ్ ఆరోపణ
- ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కోశాధికారికి ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధి లేఖ
ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని, అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) హెచ్చరించింది. ఈ మేరకు హెచ్‌సీఏ కోశాధికారికి ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధి లేఖ రాశారు.
కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్‌రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. దీన్ని సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చామని, అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడటం ఇష్టం లేనట్లుగా ఉందని తెలిపింది.
అదే ఉద్దేశమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నామని, గత రెండేళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయంది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాట్లు చేయాలని ఎస్ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు సన్‌రైజర్స్ 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తోంది. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది సామర్థ్యం 30 మాత్రమేనని, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని హెచ్‌సీఏ అడిగినట్లు తెలిసింది.
దీనిపై చర్చిద్దామని సన్‌రైజర్స్ చెప్పగా… గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్స్‌కు తాళాలు వేశారు. అదనంగా మరో 20 టికెట్లు ఇస్తే తప్ప దాన్ని తెరవమంటూ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సన్‌రైజర్స్ లేఖ రాసింది.