- ఈరోజు రాప్తాడులో పర్యటించిన జగన్
- హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు
- స్వల్పంగా దెబ్బతిన్న హెలికాప్టర్
వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
మరోవైపు, జగన్ వచ్చిన హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే దాని మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకుపోయారు. దీంతో, హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అదే హెలికాప్టర్ లో బెంగళూరుకు వెళ్లడం సురక్షితం కాదని పైలట్లు జగన్ కు చెప్పారు. దీంతో, ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనమయ్యారు.
పోలీసులను బట్టలూడదీసి కొడతాం: జగన్

- రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు
- పోలీసుల యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్
- చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్ ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
లింగమయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని… రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు కలిగిందని… 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందని చెప్పారు. టీడీపీకి బలం లేకపోయినా ఎన్నికల్లో నిలుస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉన్నాననే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని… నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని జగన్ మండిపడ్డారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేశ్ పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేనని చెప్పారు.