- ఆయన ఉపముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల దురదృష్టమన్న కవిత
- పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని వ్యాఖ్య
- వైసీపీ తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఏపీకి ఉపముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఏపీలో వైసీపీతో మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ నిజానికి సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా వామపక్ష భావజాలంతో కనిపించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్నారని కవిత విమర్శించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని, అది ఏపీ ప్రజల దురదృష్టమని అన్నారు. చెగువేరాను ఆదర్శంగా తీసుకున్నట్లు ప్రకటించిన పవన్ ప్రారంభంలో సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత లెఫ్ట్ భావజాలం విడిచి హిందుత్వం వైపు మొగ్గు చూపారని, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. హిందుత్వం మీద ఆయనకు ఇప్పుడు అతిభక్తి పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఆయన చేసే ప్రకటనల్లో ఒకదానికొకటి పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.