ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న బీసీసీఐ తాజాగా ప్రత్యక్ష ప్రసారంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కృత్రిమ మేధతో పనిచేసే రోబోడాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బ్రాడ్ కాస్టింగ్ బృందంలో చేరిన ఈ రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ముంబై, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు సాధన చేస్తున్న సమయంలో ఈ రోబోడాగ్ వారిని పలకరించింది. అంతేకాదు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించింది.