—
జీవిత బీమా, ఆరోగ్య బీమాల సంగతి సరే మరి ప్రేమ బంధానికి బీమా ఉండొద్దా అనుకున్నాడో యువకుడు.. అనుకున్నదే తడవు దానిని వ్యాపార అవకాశంగా మార్చేసుకున్నాడు. ప్రేమికులు తమ ప్రేమకు బీమా చేయించుకోవచ్చని ప్రకటించాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రిలేషన్ షిప్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చాడు. ఈ పాలసీ తీసుకున్న ప్రేమికులు ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఎప్పుడు వివాహం చేసుకున్నా పెద్ద మొత్తంలో తిరిగి చెల్లిస్తానని వివరించాడు. ఐదేళ్లపాటు మీరు చెల్లించిన ప్రీమియం మొత్తానికి పది రెట్లు అధికంగా.. అంటే లక్షల్లో తిరిగి అందుకోవచ్చని చెబుతున్నాడు.
అయితే, ప్రేమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లిన జంటలకే ఈ బీమా మొత్తం అందుకునే అవకాశం ఉంటుందని, మధ్యలో విడిపోయిన జంటలకు రూపాయి కూడా తిరిగి ఇవ్వనని తేల్చిచెప్పాడు. ప్రస్తుతం ప్రేమించుకుంటున్న జంటల్లో పెళ్లిపీటలు ఎక్కేవాళ్లు అతి తక్కువ మందే. కారణాలు ఏవైనా చాలామంది ప్రేమికులు ఒకటి రెండేళ్లకు మించి తమ బంధాన్ని నిలుపుకోవడంలేదు. కొద్దిమంది ఏళ్ల తరబడి ప్రేమించుకున్నా కూడా వారి ప్రేమ పెళ్లిపీటల దాకా వెళ్లడంలేదు. ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యమని, అందుకే ‘జికీ లవ్’ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చానని చెబుతున్నాడు.