- బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో చెలరేగిన మంటలు
- హోటల్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం
- ఆరో అంతస్తులో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల బస
- ప్రమాదం కారణంగా హోటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన వైనం
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ స్టార్ హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో హోటల్ స్టాఫ్, గెస్టులు ఆందోళనకు గురయ్యారు.
భారీగా ఎగసిపడిన మంటల కారణంగా దట్టమైన పొగలు కమ్మేశాయి. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. వారి సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
కాగా, ఈ ప్రమాద సమయంలో సన్‌రైజర్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్లేయర్లు ఆరో అంతస్తులో ఉన్నారు. వెంటనే ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ కోసం గత కొన్నిరోజులుగా సన్‌రైజర్స్ ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ ఇక్కడే బస చేస్తున్నారు. ఇవాళ్టి సంఘటన కారణంగా వారు వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.