బీజేపీ కూటమి నుంచి తన పార్టీ వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి
- బీహార్ లో ఆర్ఎల్జీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి
- అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆ పార్టీ చీఫ్ పశుపతి పరాస్ ప్రకటన
- నితీశ్ కుమార్ దళిత వ్యతిరేకి అంటూ ఆరోపణలు
కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జీపీ) వైదొలిగింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్, కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ సోమవారం ఓ ప్రకటన జారీ చేశారు. దశాబ్దకాలంగా ఎన్డీయే కూటమిలో కొనసాగినప్పటికీ, కూటమి దళిత వ్యతిరేక వైఖరిని భరించలేక బయటకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు సోమవారం పాట్నాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పరాస్ ఈ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి ఎన్డీయే కూటమికి ఆర్ఎల్జీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్జీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు దళితులంటే గిట్టదని ఆరోపించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో పర్యటించానని రాబోయే రోజుల్లో మిగతా 16 జిల్లాల్లో పర్యటిస్తానని పరాస్ తెలిపారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని తాను గుర్తించానని వివరించారు. బీహార్ ప్రజలు నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని రాష్ట్రంలో ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.