- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
- మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రులు
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు నిధులు, ఐటీ అభివృద్ధికి భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, అనిత మీడియాకు వివరాలు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలో నియమించిన జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు ముసాయిదా ఆర్డినెన్స్‌ను సిద్ధం చేశారు. దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.