Mallu Bhatti Vikramarka
తెలంగాణ వార్తలు

ప్రణాళికాబద్ధంగా యువతకు ఉపాధి కల్పన … తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని మార్గాలను అన్వేషించి, ప్రణాళికా బద్ధంగా ఉపాధి కల్పిస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ఆయన 5 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వైరా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ కావాలని సూచించారు. ప్రతి నిమిషం విలువైనదని, ఉద్యోగం చేస్తూ కూడా యువత తమ అభివృద్ధి, లక్ష్యాల సాధన కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలన్నారు. యువత అనేక ఆశలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొందని, కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత  పాలకులు గ్రూప్1 పరీక్షలు నిర్వహించ లేక పోయారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను  ప్రక్షాళన చేశామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. పట్టణాలలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రూ. 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ( జూన్ 2న ) స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు దాదాపు రూ. 21 వేల కోట్లతో 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామన్నారు. పంట భీమా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించామని,  డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు సాగు నీరు సౌకర్యం కల్పించేందుకు రూ. 12 వేల 600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించామని భట్టి చెప్పారు. ఈ పథకం క్రింద 2 లక్షల 10 వేల ఎకరాల భూముల్లో బోర్లు, సోలార్ మోటార్, డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఈ సంవత్సరమే 5 లక్షల రూపాయల విలువైన ఇందిరమ్మ ఇళ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 మంజూరు చేస్తామని, రాబోయే ఐదు సంవత్సరాల పాటు డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించనున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

ఈ జాబ్ మేళాలో వైరా నియోజక వర్గ పరిధిలోని 8 వేలకు పైగా యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో చాలా మందికి నేడు ఉపాధి లభిస్తుందన్నారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో  వైరా నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, యువతకు అవసరమైన స్కిల్ అందించేందుకు  ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేశామన్నారు.  వైరా ప్రాంత రైతులకు సాగు నీరందించేందుకు సీతారామ ఎత్తి పోతల పథకం క్రింద ప్రత్యేకంగా రాజీవ్ కేనాల్ ను 100 కోట్ల రూపాయలతో పూర్తి చేశామని చెప్పారు. అలాగే, వైరా చెరువు కాల్వల పునరుద్ధరణ కోసం రూ. 44 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. చిన్న నీటి బొట్టు కూడా వదల కుండా రైతుల పొలాలకు సాగు నీరు మళ్లించేలా చర్యలు చేపట్టామన్నారు.

ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సింగరేణి జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మేళాకు దాదాపు 8 వేల మంది యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆఫర్ లెటర్లను డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సింగరేణి సిఎండి బలరాం, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ శాలోమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రైజింగ్-2047 పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

Ram Narayana

రాజకీయ ఉచ్చులో పడొద్దు.. ఓయూ విద్యార్థులకు సీఎం రేవంత్ హితవు…

Ram Narayana

ప్రియుడిని పెళ్లి చేసుకున్న కూతురు.. తన ఆవేదనను ఫ్లెక్సీ ద్వారా తెలిపిన తండ్రి..

Ram Narayana